Asianet News TeluguAsianet News Telugu

IPL2022 RR vs GT Qualifier 1: మిల్లర్ కిల్లర్... ఫైనల్‌కి గుజరాత్ టైటాన్స్...

Qualifier 1: ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ని ముగించిన డేవిడ్ మిల్లర్... ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్‌కి గుజరాత్ టైటాన్స్... 

IPL2022 RR vs GT Qualifier 1: David Millier, Hardik Pandya Innings Gujarat titans beats Rajasthan Royals
Author
India, First Published May 24, 2022, 11:33 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి వచ్చిన గుజరాత్ టైటాన్స్, మొదటి క్వాలిఫైయర్‌లోనూ ఘన విజయాన్ని అందుకుని ఫైనల్‌‌కి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించిన గుజరాత్ టైటాన్స్, మొట్టమొదటి సీజన్‌లోనే ఫైనల్ చేరి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది...

రెండో బంతికే వృద్ధిమాన్ సాహాని డకౌట్ చేశాడు ట్రెంట్ బౌల్ట్. సున్నా పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. మాథ్యూ వేడ్, శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 21 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత కొద్దిసేపటికే 30 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసిన మాథ్యూ వేడ్.. ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 85 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టైటాన్స్. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్, హార్ధిక్ పాండ్యా కలిసి గుజరాత్ టైటాన్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు...

విజయానికి 12 బంతుల్లో 23 పరుగులు కావాల్సిన దశలో ఓబెడ్ మెక్‌కాయ్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో టైటాన్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి బంతికే సిక్సర్ బాదిన డేవిడ్ మిల్లర్, రెండో బంతిని కూడా బౌండరీ అవతల పడేశాడు. దీంతో టైటాన్స్ విజయానికి ఆఖరి 4 బంతుల్లో 4 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి... మూడో బంతికి సిక్సర్ బాదిన మిల్లర్ డ్రామా లేకుండానే మ్యాచ్‌ని ముగించాడు. 

హార్ధిక్ పాండ్యా 27 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేయగా డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి  188 పరుగులు చేసింది...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి శుభారంభం దక్కలేదు. 8 బంతుల్లో 3 పరుగులు చేసిన యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యష్ దయాల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా స్వేచ్ఛందంగా పెవిలియన్‌కి బయలుదేరి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు జైస్వాల్...

క్రీజులోకి వస్తూనే మొదటి బంతికే సిక్సర్ బాదిన సంజూ శాంసన్, ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన సంజూ, ఐపీఎల్ 2022 సీజన్‌లో 400+ పరుగులు పూర్తి చేసుకున్నాడు...

రాహుల్ త్రిపాఠి తర్వాత ఈ సీజన్‌లో 150+ స్ట్రైయిక్ రేటుతో 400+ పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్. రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్‌కి నాకౌట్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు. ఇంతకుముందు 2018 ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై 46 పరుగులు చేశాడు అప్పటి ఆర్ఆర్ కెప్టెన్ అజింకా రహానే. ఆ మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన సంజూ శాంసన్, కెప్టెన్‌గా రహానే రికార్డును బ్రేక్ చేశాడు...

సాయి కిషోర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన సంజూ శాంసన్, బౌండరీ లైన్ దగ్గర అల్జెరీ జోసఫ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దేవ్‌దత్ పడిక్కల్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

అయితే పడిక్కల్ అవుటైన తర్వాత రషీద్ కాన్ వేసిన 16వ ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. యష్ దయాల్ వేసిన 17వ ఓవర్‌లో నాలుగు ఫోర్లతో 18 పరుగులు రాబట్టాడు...  అల్జెరీ జోసఫ్ వేసిన 18వ ఓవర్‌లో 3 ఫోర్లతో 14 పరుగులు వచ్చాయి...

7 బంతుల్లో 4 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో హార్ధిక్ పాండ్యా స్లిప్ కాగా, మరోసారి రషీద్ ఖాన్ క్యాచ్‌ని డ్రాప్ చేశాడు...

రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జోస్ బట్లర్... 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేసి రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios