18.2 ఓవర్లలో 137 పరుగులకి ఆలౌట్ అయిన పంజాబ్ కింగ్స్... నాలుగు వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసిన కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఉమేశ్ యాదవ్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్‌లతో దూసుకుపోతున్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో రెండేసి వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, మూడో మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి... పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లోకి దూసుకెళ్లాడు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, 18.2 ఓవర్లలో 137 పరుగులకి పరిమితమైంది... సీఎస్‌కేతో జరిగిన మొదటి మ్యాచ్‌లో, ఆర్‌సీబీతో జరిగిన రెండో మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసిన ఉమేశ్ యాదవ్... పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ తొలి ఓవర్‌లోనే వికెట్ సాధించాడు...

5 బంతులాడి ఒక్క పరుగు చేసిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన భనుక రాజపక్ష వస్తూనే హిట్టింగ్‌కి దిగాడు. 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు రాజపక్ష...

శివమ్ మావి బౌలింగ్‌లో ఓ ఫోర్, వరుసగా మూడు సిక్సర్లు బాదిన రాజపక్ష, మరో భారీ షాట్‌కి ప్రయత్నించి టిమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... అప్పటికి 4 ఓవర్లలోనే 33 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. 

15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన శిఖర్ ధావన్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో సామ్ బిల్లింగ్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్... అయితే పవర్ ప్లే ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు...

9వ ఓవర్‌లో తిరిగి ఉమేశ్ యాదవ్‌కి బాల్‌ని అందించిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఫలితం రాబట్టాడు. 16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అండర్19 వరల్డ్ కప్ హీరో రాజ్ భవ 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసి నరైన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

రాజ్ భవ వికెట్‌తో పంజాబ్ కింగ్స్‌పై 32 వికెట్లు పూర్తి చేసుకున్న సునీల్ నరైన్, ఐపీఎల్‌లో ఒకే టీమ్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు లసిత్ మలింగ పేరిట ఉండేది. మలింగ, సీఎస్‌కేపై 31 వికెట్లు పడగొట్టాడు...

5 బంతులాడిన షారుక్ ఖాన్, సౌథీ బౌలింగ్‌లో డకౌట్ కాగా 15వ ఓవర్‌లో 2 వికెట్లు తీసి మెయిడిన్ ఓవర్‌ వేశాడు ఉమేశ్ యాదవ్. 18 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన హర్‌ప్రీత్ బ్రార్‌ని బౌల్డ్ చేసిన ఉమేశ్ యాదవ్, రాహుల్ చాహార్‌ని డకౌట్ చేశాడు...

4 ఓవర్లలో 23 పరుగులిచ్చి ఓ మెయిడిన్‌తో 4 వికెట్లు తీశాడు ఉమేశ్ యాదవ్. ఐపీఎల్ కెరీర్‌లో ఉమేశ్ యాదవ్‌కి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. టిమ్ సౌథీ వేసిన 17వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టాడు కగిసో రబాడా. ఆ తర్వాతి ఓవర్‌లో ఓడియన్ స్మిత్ ఓ సిక్సర్, రబాడా రెండు ఫోర్లు బాదడంతో 17 పరుగులు వచ్చాయి...

16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన కగిసో రబాడా, ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ కావడంతో 137 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.