ముంబై ఇండియన్స్ విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన కేకేఆర్... ఒకే ఓవర్‌లో 35 పరుగులు బాది, ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ప్యాట్ కమ్మిన్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కూడా హ్యాట్రిక్ ఓటములను చవి చూసింది. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కేని మొదటి మ్యాచ్‌లో ఓడించిన కేకేఆర్, ముంబై ఇండియన్స్‌కి చిత్తు చేసి సీజన్‌లో మూడో విజయాన్ని అందుకుంది.
162 పరుగుల లక్ష్యఛేదనలో కేకేఆర్‌కి శుభారంభం దక్కలేదు. అజింకా రహానే 11 బంతుల్లో 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 6 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి డానియల్ సామ్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సామ్ బిల్లింగ్స్ 12 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ తర్వాతి ఓవర్‌లో 7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన నితీశ్ రాణాని పెవిలియన్ చేర్చాడు మురుగన్ అశ్విన్...
ఆండ్రే రస్సెల్ 5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి తైమల్ మిల్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు.
విజయానికి 30 బంతుల్లో 35 పరుగులు కావాల్సిన దశలో డానియల్ సామ్స్‌కి బౌలింగ్ అప్పగించాడు రోహిత్ శర్మ. ఆ ఓవర్‌లో వరుసగా 6, 4, 6, 6 కొట్టిన ప్యాట్ కమ్మిన్స్, ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. అయితే అది నో బాల్ కావడంతో కమ్మిన్స్ నాటౌట్‌గా మిగిలాడు...
ఫ్రీ హిట్‌కి ఫోర్ బాదిన ప్యాట్ కమ్మిన్స్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికి సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు ప్యాట్ కమ్మిన్స్. 16వ ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు వచ్చాయి. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన కమ్మిన్స్, కెఎల్ రాహుల్‌తో కలిసి ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో ఉమేశ్ యాదవ్ వేసిన మొదటి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే వచ్చింది...
12 బంతులాడిన రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి సామ్ బిల్లింగ్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే అవుటైన ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు రోహిత్ శర్మ.
రోహిత్‌కి ఇది 61వ సింగిల్ డిజిట్ స్కోరు కాగా దినేశ్ కార్తీక్ 60 సార్లు అంకె స్కోరుకే అవుట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన యంగ్ బ్యాటర్ డేవాల్డ్ బ్రేవిస్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...
వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన బ్రేవిస్, స్టంపౌట్ అయ్యాడు. 21 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్...
11 ఓవర్లు ముగిసే సమయానికి 55 పరుగులు మాత్రమే చేసిన ముంబై, 15 ఓవర్లు ముగిసే వరకు 85 పరుగులు చేయగలిగింది. ప్యాట్ కమ్మిన్స్ వేసిన 16వ ఓవర్‌లో ఓ సిక్సర్, ఫోర్ బాది 13 పరుగులు రాబట్టిన తిలక్ వర్మ, స్కోరు వేగం పెంచాడు.
వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి 17 పరుగులు రాబట్టగా సునీల్ నరైన్ వేసిన 18వ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్‌లో బౌలింగ్‌కి రస్సెల్ 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు...
34 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న సూర్యకుమార్ యాదవ్, 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి అవుట్ అయ్యాడు. 2017 నుంచి సూర్యకుమార్ యాదవ్‌కి ఇది 13వ హాఫ్ సెంచరీ. గత 5 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్..
ఆఖరి ఓవర్‌లో 3 సిక్సర్లతో 5 బంతుల్లో 22 పరుగులు చేసిన కిరన్ పోలార్డ్, ముంబై ఇండియన్స్ స్కోరును 160+ దాటించాడు. అజింకా రహానే క్యాచ్ డ్రాప్ కారణంగా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తిలక్ వర్మ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
