IPL 2022 MI vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మొదట బ్యాటింగ్ చేసి భారీ విజయాన్ని అందుకోగా, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది...

గత సీజన్లలో ముంబై ఇండియన్స్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న ట్రెంట్ బౌల్ట్‌తో నాథన్ కౌంటర్‌నైల్, జేమ్స్ నీశమ్ వంటి ప్లేయర్లు... ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా బరిలో దిగబోతున్నారు. గాయం కారణంగా మొదటి మ్యాచ్‌లో బరిలో దిగని ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, నేటి మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు. సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌గా ఉన్నా, అతనికి మరికొంత సమయం ఇవ్వాలని భావించిన టీమ్ మేనేజ్‌మెంట్, నేటి మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించింది... 

ముంబై ఇండియన్స్ తరుపున గత మూడు మ్యాచుల్లోనూ 50+ పరుగులు చేశాడు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. సూర్యకుమార్ యాదవ్ గైర్హజరీతో నేటి మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషన్ కీలకంగా మారబోతున్నాడు... సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ముంబై ఇండియన్స్‌లో వన్ డౌన్ ప్లేయర్‌గా స్థానం దక్కించుకున్న అన్‌మోల్‌ప్రీత్ సింగ్, మొదటి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. 9 బంతులాడి 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

తన సత్తా నిరూపించుకోవడానికి అన్‌మోల్‌ప్రీత్ సింగ్‌కి ఇదే ఆఖరి అవకాశం కావచ్చు. నేటి మ్యాచ్‌లో అన్‌మోల్‌ప్రీత్ విఫలమైతే, అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ ఖాయమైపోతుంది. గత సీజన్లలో పోలిస్తే ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది...

జస్ప్రిత్ బుమ్రాకి తోడుగా సరైన పేసర్ లేకపోవడం ముంబై ఇండియన్స్‌ని మొదటి మ్యాచ్‌లో బాగా ఇబ్బందిపెట్టింది. మురుగన్ అశ్విన్ ఒక్కడు చక్కగా రాణిస్తూ, రాహుల్ చాహార్ లేని లోటును తెలియకుండా చేస్తున్నాడు...

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్లపైనే భారీ ఆశలు పెట్టుకుంది. అశ్విన్, చాహాల్.. ముంబై బ్యాటర్లను ఇబ్బందిపెడతారని ఆశిస్తోంది. అలాగే ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. నవ్‌దీప్ సైనీ కూడా షైన్ అయితే, బౌన్సర్లతో ఎలాంటి బ్యాటర్‌ని అయినా ముప్పుతిప్పలు పెట్టగలడు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటింగ్ భారాన్ని మోసిన కెప్టెన్ సంజూ శాంసన్, ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడు యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, జోస్ బట్లర్ బ్యాటు ఝులిపిస్తే, ముంబై ఇండియన్స్ ముందు భారీ టార్గెట్ పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, సిమ్రాన్ హెట్మయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, ట్రెంట్ బౌల్ట్, నవ్‌దీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కిరన్ పోలార్డ్, టిమ్ డేవిడ్, డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, తేమల్ మిల్స్, బాసిల్ తంపి