IPL 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్... వరుసగా 24వ మ్యాచ్‌లోనూ తీరు మార్చుకోని కెప్టెన్లు... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నింటిలో టాస్ గెలిచిన కెప్టెన్లు ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం. 

వరుసగా మొదటి మూడు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్, గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడింది. మొదటి నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఘన విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, పాయింట్ల పట్టికలో టాప్‌ పొజిషన్‌లో ఉంది... నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నాలుగో విజయంతో టేబుల్ టాప్‌కి వెళ్తుంది.

గుజరాత్ టైటాన్స్ రెండు మార్పులతో బరిలో దిగుతోంది. దర్శన్ నాల్కండే స్థానంలో యశ్ దయాల్ ఐపీఎల్ ఆరంగ్రేటం చేస్తుంటే సాయి సుదర్శన్ స్థానంలో విజయ్ శంకర్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యశ్ దయాల్, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.3.20 కోట్లు దక్కించుకున్నాడు. 

దర్శన్ నాల్కండే మొదటి రెండు మ్యాచుల్లో ఆకట్టుకున్నా, అతని స్థానంలో యశ్ దయాల్‌ ఎంట్రీ ఇవ్వడంతో ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్‌పై అంచనాలు పెరిగిపోయాయి. 

రాజస్థాన్ రాయల్స్ ఒకే మార్పుతో నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతోంది. ట్రెంట్ బౌల్ట్ గాయంతో నేటి మ్యాచ్‌కి దూరం కాగా అతని స్థానంలో జిమ్మీ నీశమ్‌కి తుది జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ ఆల్‌రౌండర్, తనకి దక్కిన ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మొత్తం శుబ్‌మన్ గిల్‌పై ఆధారపడి ఉంది. గత మ్యాచ్‌లో గిల్ త్వరగా అవుట్ కావడంతో గుజరాత్ టైటాన్స్ తొలి ఓటమిని అందుకోవాల్సి వచ్చింది. రషీద్ ఖాన్ ఫామ్‌లోకి రావడం గుజరాత్ టైటాన్స్‌కి కలిసొచ్చే విషయం. 

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వేసిన ఎత్తుగడలు, ఐపీఎల్ ఫ్యాన్స్‌ని కుచింత ఆశ్చర్యానికి గురి చేశాయి. రిటైర్ అవుట్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఆఖరి 10 బంతులు మిగిలి ఉండగానే పెవిలియన్ చేరడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. 

గుజరాత్ టైటాన్స్ జట్టు: మాథ్యూ వేడ్, శుబ్‌మన్ గిల్, విజయ్ శంకర్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లూకీ ఫర్గూసన్, మహ్మద్ షమీ, యశ్ దయాల్

రాజస్థాన్ రాయల్స్ జట్టు: జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, సిమ్రాన్ హెట్మయర్, జిమ్మీ నీశమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యజ్వేంద్ర చాహాల్