ఐపీఎల్ 2022 సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్... కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు... 

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచుల్లో 80+ స్కోర్లు చేసి అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్... గ్యాప్ తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ... వరుసగా రెండోసారి 50+ స్కోర్లు నమోదు చేశాడు... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కి శుభారంభం దక్కలేదు. 11 బంతులాడి ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, మోహ్సీన్ ఖాన్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన మాథ్యూ వేడ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

13 బంతులాడి 11 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 51 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. ఈ దశలో డేవిడ్ మిల్లర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు శుబ్‌మన్ గిల్...

24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఆయుష్ బదోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్ భాగస్వామ్యం నిర్మించడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో స్కోరు వేగం మందగించింది. 16 ఓవర్లు ముగిసే సమయానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది గుజరాత్ టైటాన్స్...

మోహ్సీన్ ఖాన్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీయగా ఆవేశ్ ఖాన్ 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో ఈ ఇద్దరూ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాహుల్ తెవాటియా, శుబ్‌మన్ గిల్ బౌండరీలు బాదడానికి ఎంత కష్టపడినా పెద్దగా వర్కవుట్ కాలేదు...

ఛమీరా వేసిన 17వ ఓవర్‌లో 14 పరుగులు వచ్చినా మోహ్సీన్ ఖాన్ వేసిన 18వ ఓవర్‌లో 5 పరుగులు, 19వ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. జాసన్ హోల్డర్ వేసిన 20వ ఓవర్‌లో 16 పరుగులు రాబట్టాడు రాహుల్ తెవాటియా. దీంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది గుజరాత్ టైటాన్స్..

శుబ్‌మన్ గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేయగా రాహుల్ తెవాటియా 16 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు, ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలుస్తుంది...