టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... మ్యాచ్ గెలిచిన జట్టు, నేరుగా ప్లేఆఫ్స్‌కి... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు టేబుల్ టాపర్ లక్నో సూపర్ జెయింట్స్, రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడనుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మిగిలిన జట్ల కెప్టెన్లు అందరూ టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకుంటుంటే, హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకోవడం ఇది మూడోసారి...

నేటి మ్యాచ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నుంచి కరణ్ శర్మ, గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి సాయి కిషోర్ ఐపీఎల్ ఆరంగ్రేటం చేస్తున్నారు. ఇరు జట్ల మధ్య సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ మొదటి బంతికే కెఎల్ రాహుల్ డకౌట్ కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీపక్ హుడా 55, ఆయుష్ బదోనీ 54 పరుగులతో రాణించారు. 157 పరుగుల లక్ష్యఛేదనలో శుబ్‌మన్ గిల్ డకౌట్ అయినా మాథ్యూ వేడ్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా కలిసి గుజరాత్‌కి 5 వికెట్ల తేడాతో తొలి విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్ ఫలితం అధికారికంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించే మొట్టమొదటి జట్టును ఖరారు చేయనుంది... 8 విజయాలతో సమానంగా ఉన్న ఇరుజట్లు, ఇంకో మ్యాచ్ గెలిస్తే మిగిలిన ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కి చేరతాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు జట్ల మధ్యే జరుగుతుండడంతో గెలిచిన టీమ్, ప్లేఆఫ్స్‌కి చేరనుంది...

గత సీజన్లలో ముంబై ఇండియన్స్‌కి కలిసి ఆడిన పాండ్యా బ్రదర్స్ హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా... ఈ సీజన్‌లో వేర్వేరు జట్ల తరుపున బరిలో దిగుతున్నారు. హార్ధిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, అన్న కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు...

నేటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిస్తే నాలుగో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ టాప్ 2లోకి వచ్చేందుకు ఛాన్సులు పెరుగుతాయి. అదే గుజరాత్ టైటాన్స్ గెలిస్తే మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, టాప్ 2లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి... ఐపీఎల్ 2022 సీజన్‌లో జరిగిన గత నాలుగైదు మ్యాచులు వన్ సైడెడ్‌గా సాగి, ఫ్యాన్స్‌కి మజాని ఇవ్వలేకపోయాయి. అయితే నేటి మ్యాచ్‌లో ఇరు జట్లలోనూ మ్యాచు విన్నర్లు పుష్కలంగా ఉండడంతో హోరాహోరీ ఫైట్ సాగుతుందని అంచనా వేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోనీ, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కరణ్ శర్మ, దుస్మంత ఛమీరా, ఆవేశ్ ఖాన్, మోహ్సీన్ ఖాన్

గజరాత్ టైటాన్స్ జట్టు: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జెరీ జోసఫ్, యష్ దయాల్, మహ్మద్ షమీ