లక్నో సూపర్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్... రాణించిన రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, హార్ధిక్ పాండ్యా... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టునే విజయం వరించింది. ఐపీఎల్ న్యూకమర్స్ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కొత్త కెప్టెన్ హార్ధిక్ పాండ్యా విజయాన్ని అందుకున్నాడు...

159 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన గుజరాత్ టైటాన్స్‌కి శుభారంభం దక్కలేదు. శుబ్‌మన్ గిల్ మూడు బంతులాడి డకౌట్ కాగా విజయ్ శంకర్ 6 బంతుల్లో 4 పరుగులు చేసి ఛమీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మాథ్యూ వేడ్, హార్ధిక్ పాండ్యా కలిసి మూడో వికెట్‌కి 57 పరుగులు జోడించారు...

28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ కాగా 29 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసిన మాథ్యూ వేడ్‌ని దీపక్ హుడా క్లీన్ బౌల్డ్ చేశాడు...

వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్‌ని డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా కలిసి ఆదుకున్నారు. ఐదో వికెట్‌కి తెవాటియాతో కలిసి 60 పరుగుల భాగస్వామ్యం జోడించిన డేవిడ్ మిల్లర్, 21 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

విజయానికి 16 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన దశలో డేవిడ్ మిల్లర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే రాగా ఛమీరా వేసిన 19వ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 11 పరుగులు కావాల్సి వచ్చింది...

వరుసగా రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదిన అభినవ్ మనోహర్, గుజరాత్‌ విజయాన్ని లాంఛనం చేశాడు. రాహుల్ తెవాటియా ఫోర్ బాది, మ్యాచ్‌ని ముగించాడు. రాహుల తెవాటియా 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేయగా, అభినవ్ మనోహర్ 7 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది...

ఇన్నింగ్స్ తొలి బంతికే లక్నో కెప్టెన్‌ కెఎల్ రాహుల్‌ని అవుట్ చేసిన మహ్మద్ షమీ, ఊహించని షాక్ ఇచ్చాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు కెఎల్ రాహుల్. అంపైర్ తొలుత నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన గుజరాత్ టైటాన్స్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది...

9 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇవిన్ లూయిస్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి వరుణ్ ఆరోన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. 

ఆ తర్వాత 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన మనీశ్ పాండేని ఓ సూపర్ బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు షమీ. దీంతో 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్ జెయింట్స్.. యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోనీ, దీపక్ హుడా కూడా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి 63 పరుగులు మాత్రమే చేయగలిగింది లక్నో సూపర్ జెయింట్స్...

వరుణ్ ఆరోన్ వేసిన 13వ ఓవర్‌తో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టాడు దీపక్ హుడా. ఆ తర్వాతి ఓవర్2లో సిక్స్ కొట్టిన దీపక్ హుడా 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

అప్పటివరకూ 22 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసిన ఆయుష్ బదోనీ... హార్ధిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో వరుసగా ఓ సిక్సర్, రెండు ఫోర్లు బాదాడు. 

41 బంతుల్లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన దీపక్ హుడా, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన గుజరాత్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది.

మహ్మద్ షమీ వేసిన 18వ ఓవర్‌లో కృనాల్ పాండ్యా రెండు ఫోర్లు బాదగా, ఆయుష్ బదోనీ ఓ ఫోర్ బాది 15 పరుగులు రాబట్టారు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆయుష్ బదోనీ... 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి... వరుణ్ ఆరోన్ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు...