ఐపీఎల్ 2022 సీజన్‌లో సీఎస్‌కేకి తొలి విజయం... 4 వికెట్లు తీసిన మహీశ్ తీక్షణ, రవీంద్ర జడేజాకి మూడు వికెట్లు... షాబజ్ అహ్మద్, సూయాశ్ ప్రభుదేశాయ్, దినేశ్ కార్తీక్ మెరుపులు వృథా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, ట్రోలింగ్‌ని ఎదుర్కన్న చెన్నై సూపర్ కింగ్స్... ఎట్టకేలకు ఐదో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో వన్‌సైడెడ్ విజయం సాధించి, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్... 217 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సీఎస్‌కే, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 193 పరుగులకి పరిమితమైంది.
217 పరుగుల కొండంత లక్ష్యఛేదనలో ఆర్‌సీబీ టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. 9 బంతుల్లో 8 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో జోర్డాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తీక్షణకి ఇదే మొట్టమొదటి ఐపీఎల్ వికెట్. విరాట్ కోహ్లీ 3 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ కాగా 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసిన అనుజ్ రావత్‌ని తీక్షణ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు...
11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది రాయల్ ఛాలెంజర్స్...
తొలి మ్యాచ్ ఆడుతున్న సూయాశ్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్ కలిసి ఆరో వికెట్‌కి 33 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 18 బంతుల్లో ఓ ఫోర్, 5 సిక్సర్లతో 34 పరుగులు చేసిన ప్రభుదేశాయ్, తీక్షణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
27 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేసిన షాబజ్ అహ్మద్, మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తీక్షణ 33 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఓ సిక్స్‌తో 7 పరుగులు చేసిన వానిందు హసరంగ, జడేజా బౌలింగ్‌లో జోర్డాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో ఆకాశ్ దీప్ డకౌట్ అయ్యాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి నాలుగు మ్యాచుల్లో నాటౌట్‌గా నిలిచిన దినేశ్ కార్తీక్ ఇచ్చిన క్యాచ్‌ని ముకేశ్ చౌదరి జారవిడిచాడు. ముకేశ్ చౌదరి వేసిన 17వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 23 పరుగులు రాబట్టాడు దినేశ్ కార్తీక్. దీంతో ఆఖరి 3 ఓవర్లలో ఆర్‌సీబీ విజయానికి 48 పరుగులు కావాల్సి వచ్చింది.
14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, డీజే బ్రావో బౌలింగ్‌లో జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఆర్‌సీబీ పరాజయం ఖాయమైపోయింది. ఆఖర్లో సిరాజ్ 14, హజల్‌వుడ్ 7 పరుగులు చేసి పోరాడిన ఓటమి తేడాని తగ్గించగలిగారంతే.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసి జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది సీఎస్‌కే. ఆ తర్వాత మొయిన్ ఆలీ 8 బంతుల్లో 3 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 6.4 ఓవర్లు ముగిసే సరికి 36 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్...
ఆ తర్వాత రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే కలిసి మూడో వికెట్‌కి 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 60 పరుగులు మాత్రమే చేసిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత జోరు పెంచింది.
ఐపీఎల్ చరిత్రలో మూడు అంతకంటే కింద వికెట్లకు ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు కామెరూన్ వైట్, కుమార సంగర్కర కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 157 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ రికార్డును పదేళ్ల తర్వాత అధిగమించారు దూబే, ఊతప్ప జోడీ...
50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 88 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, వానిందు హసరంగ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రాబిన్ ఊతప్పకి ఇదే ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు. ఊతప్ప అవుటైన తర్వాతి బంతికే కెప్టెన్ రవీంద్ర జడేజా గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 96 పరుగులు చేసిన శివమ్ దూబే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి భారీ షాక్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 96 పరుగుల వద్ద అవుటైన రెండో ప్లేయర్ శివమ్ దూబే. ఇంతకుముందు శుబ్‌మన్ గిల్ కూడా 96 పరుగులకే అవుట్ అయ్యి సెంచరీ మిస్ చేసుకున్నాడు.
