టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్‌తో తలబడుతోంది చెన్నై సూపర్ కింగ్స్. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్‌ని ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్, మొదటి రెండు మ్యాచుల్లోనూ ఓడింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టిన రవీంద్ర జడేజా, మొదటి రెండు మ్యాచుల్లో పరాజయాలను చవి చూశాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే మొదటి రెండు మ్యాచుల్లో ఓడడం ఇదే తొలిసారి...

మరోవైపు ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న మయాంక్ అగర్వాల్, మొదటి మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్నాడు. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధించిన 205 పరుగుల టార్గెట్‌ను ఈజీగా ఛేదించి, అద్భుత విజయం అందుకుంది పంజాబ్ కింగ్స్...

రెండో మ్యాచ్‌లో దూకుడుగా ఆరంభించి, మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో వరుస వికెట్లు కోల్పోయి కేకేఆర్ చేతుల్లో ఓడిన పంజాబ్ కింగ్స్... చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించి మళ్లీ విక్టరీ గేర్‌లోకి రావాలని భావిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఓపెనర్ జానీ బెయిర్ స్టో నేటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆరంగ్రేటం చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే మొదటి రెండు మ్యాచుల్లో లంక బ్యాటర్ భనుక రాజపక్ష కొన్ని పవర్ హిట్టింగ్ షాట్స్ ఆడాడు. కాబట్టి అతనికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న పంజాబ్ కింగ్స్, జానీ బెయిర్ స్టోకి మరో మ్యాచ్ విశ్రాంతి కల్పించినట్టు తెలుస్తోంది.

ఓడియన్ స్మిత్, కగిసో రబాడా, లియామ్ లివింగ్ స్టోన్‌లను పక్కన బెట్టలేని పరిస్థితి పంజాబ్ కింగ్స్‌ది. ఎలా చూసినా రాజపక్ష, బెయిర్ స్టో కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందే.. 

తొలి రెండు మ్యాచుల్లో సరైన బౌలర్లు లేక ఇబ్బంది పడిన చెన్నై సూపర్ కింగ్స్, తుషార్ దేశ్‌పాండే స్థానంలో క్రిస్ జోర్డాన్‌కి అవకాశం ఇచ్చింది. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా రెండు మార్పులతో బరిలో దిగుతోంది. హర్‌ప్రీత్ బ్రార్ స్థానంలో వైభవ్ అరోరాకి అవకాశం దక్కగా అండర్ 19 వరల్డ్ కప్ హీరో రాజ్ భవ స్థానంలో జితేశ్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు...

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2022 సీజన్ మొదటి రెండు మ్యాచుల్లో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. రెండు మ్యాచుల్లో కలిపి ఒక్క పరుగు మాత్రమే చేసిన రుతురాజ్ గైక్వాడ్, నేటి మ్యాచ్‌లో భారీ స్కోరు చేయాలని ఆశలు పెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్... 

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భనుక రాజపక్ష, లియామ్ లివింగ్‌స్టోన్, షారుక్ ఖాన్, జితేశ్ శర్మ, ఓడియన్ స్మిత్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడా, రాహుల్ చాహార్, వైభవ్ అరోరా

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ, శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, డ్వేన్ ప్రెటోరయాస్, ముఖేశ్ చౌదరి