IPL2022 Auction: ఐపీఎల్ మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. తొలి రోజు వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో భారత స్టార్ ప్లేయర్లు..
బెంగళూరు వేదికగా శని, ఆదివారాల్లో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి అంతా సిద్ధమైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగబోయే ఈ వేలానికి సంబంధించిన మాక్ డ్రిల్ కూడా పూర్తయ్యింది. వేలంలో పాల్గొనబోయే వారికి పాటించాల్సిన నిబంధనలపై కూడా బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంచైజీలకు తెలిపింది. మెగా వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సుమారు 1,200 మంది దాకా క్రికెటర్లు తమ పేర్లను పంపించగా.. అందులో బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. ఇక ఈ 590 మందిలోంచి వేలం తొలి రోజు.. అంటే శనివారం అదృష్టాన్ని పరీక్షించుకోబోయే ఆటగాళ్లు 161 మంది ఉన్నారు.
శనివారం నాడు జరుగబోయే వేలంలో మొత్తంగా 161 మంది క్రికెటర్లు వేలానికి వస్తారని తెలుస్తున్నది. వీరలో పది మంది మార్కీ ప్లేయర్స్ (రిజర్వ్ ప్రైజ్ రూ. 2 కోట్ల దాకా ఉన్నవాళ్లు) ఉన్నారు. ఫ్రాంచైజీలు వీరినే ‘మోస్ట్ వాంటెడ్ ప్లేయర్స్’గా అభివర్ణిస్తున్నాయి.
ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లు : ఆర్. అశ్విన్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ (వీళ్లంతా భారత ఆటగాళ్లే), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), క్వింటన్ డికాక్, ఫాఫ్ డుప్లెసిస్, కగిసొ రబాడా (దక్షిణాఫ్రికా)..
పైన పేర్కొన్న పది మంది తొలిరోజు జరుగబోయే వేలంలో ఉండనున్నారు. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్లు.. ఇలా ఓ క్రమపద్ధతిలో వేలం జరుగనున్నది.
- ఈ ఐపీఎల్ వేలంలో అత్యధిక వయసు ఉన్న క్రికెటర్ గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఇమ్రాన్ తాహీర్ (43) నిలువనున్నాడు. అత్యల్ప వయస్సు ఉన్న ఆటగాడు నూర్ అహ్మద్. అతడి వయసు 17 సంవత్సరాలే..
- రిటెన్షన్ ప్రక్రియలో ఇప్పటికే ఆయా జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య 33. 33 మందిలో ఐదుగురు అన్ క్యాప్డ్ ప్లేయర్లున్నారు. ఇందుకోసం పది ఫ్రాంచైజీలు ఖర్చు చేసిన మొత్తం రూ. 384.5 కోట్లు. వేలం కోసం ఫ్రాంచైజీలు రూ. 900 కోట్లు ఖర్చు చేయనున్నాయి.
- ఒక ఫ్రాంచైజీ 18 మంది నుంచి అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను దక్కించుకోవచ్చు.
- ఐపీఎల్ వేలంలో ప్రతి జట్టు రూ. 90 కోట్ల దాకా ఖర్చు చేయవచ్చు. కానీ రూ. 67.5 కోట్ల కంటే తక్కువ ఖర్చు చేయడానికి కూడా వీళ్లేదు.
- ఈ ఐపీఎల్ వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ లో ఉన్న ఆటగాళ్లు 48 మంది (ఇందులో 17 మంది భారత ఆటగాళ్లు) ఉన్నారు. ఆ తర్వాత రూ. 1.5 కోట్లు, రూ. 1 కోటి, రూ. 75 లక్షలు, రూ. 50 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 20 లక్షలు గా స్లాట్లు ఉన్నాయి. అంటే ఒక ఆటగాడిని రూ. 20 లక్షల కంటే తక్కువ తీసుకోవడానికి వీళ్లేదు. గరిష్ట ధర అంటూ ఏమీ లేదు. ఈ స్లాట్ల కింద ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్న పలువురు రేపు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
