Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ ను ఓడించిన అంపైర్ తప్పిదం, వీరు, ప్రీతిజింటా సహా అభిమానుల ఫైర్

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో అంపైర్‌ ఓ పరుగు కుదించటం ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. ఇన్నింగ్స్‌ 18.3 ఓవర్లో కగిసో రబాడపై మయాంక్‌ అగర్వాల్‌ విరుచుకుపడ్డాడు. యార్కర్లను అలవోకగా ఎదుర్కొని పరుగులు సాధించాడు. 

ipl2020 : umpires decision costs punjab the match, sehwag, preity fumes
Author
New Delhi, First Published Sep 21, 2020, 11:20 AM IST

అంపైరింగ్‌ తప్పిదాలు ఐపీఎల్‌లో కొత్త కాదు. గతంలోనూ పలుమార్లు అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. 'ఐపీఎల్‌ సాదాసీదా గల్లీ క్రికెట్‌ కాదు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాపులర్‌ టీ20 లీగ్‌. 

అంపైరింగ్‌ ప్రమాణాలు మెరుగుపడకపోతే లీగ్‌ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది' అని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గతంలోనే విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో రెండు మ్యాచులే ముగిశాయి. 

కానీ అంపైరింగ్‌ తప్పిదాలతో ఐపీఎల్‌ అప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిస్తోంది. దుబాయ్‌లో ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. నిర్ణీత ఓవర్ల మ్యాచ్‌లో పంజాబ్‌, ఢిల్లీలు 157/8తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో విజేతను సూపర్‌ ఓవర్‌ ద్వారా నిర్ణయించిన సంగతి తెలిసిందే. సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అలవోక విజయాన్ని నమోదు చేసింది.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో అంపైర్‌ ఓ పరుగు కుదించటం ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. ఇన్నింగ్స్‌ 18.3 ఓవర్లో కగిసో రబాడపై మయాంక్‌ అగర్వాల్‌ విరుచుకుపడ్డాడు. యార్కర్లను అలవోకగా ఎదుర్కొని పరుగులు సాధించాడు. 

ఆ ఓవర్లో మూడో బంతికి మయాంక్‌ రెండు పరుగులు తీశాడు. కానీ క్రిస్‌ జోర్డాన్‌ రెండో పరుగు సమయంలో క్రీజులో బ్యాట్‌ సరిగా ఉంచలేదని అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఆ బంతికి ఒక్క పరుగునే ఇచ్చాడు. ఆ బంతికి రూల్స్‌ ప్రకారం రెండు పరుగులు వచ్చి ఉంటే.. పంజాబ్‌ అలవోక విజయాన్ని అందుకుని ఉండేది.

అంపర్‌ నితిన్‌ మీనన్‌ తప్పుడు నిర్ణయం పట్ల ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మాజీ కెప్టనెన్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మాజీ కోచ్‌ ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్ర్తాలు సంధించాడు. నితిన్‌ మీనన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఇవ్వాలని విమర్శ చేశాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎంపికతో నేను ఏకీభవించటం లేదు.  ఈ మ్యాచ్‌లో ఓ పరుగును కుదించిన అంపైర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఇవ్వాలి. అది షార్ట్‌ రన్‌ కాదు. మ్యాచ్‌ ఫలితంలో ఆ పరుగే వ్యత్యాసం' అని వీరూ ట్వీట్‌ చేశాడు.

మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా సైతం అంపైర్‌ నిర్ణయంపై విమర్శలు గుప్పించాడు.  'అది షార్ట్‌ రన్‌ కాదు. ఇటువంటి సందర్భాల్లో టెక్నాలజిని వాడుకోవాలి. కానీ అది  ఈ పొరపాటును థర్డ్‌ అంపైర్‌ సరైన సమయంలో గుర్తించినప్పుడే సాధ్యపడుతుంది.  ఒకవేళ రెండు పాయింట్ల తేడాతో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌లో చోటు కోల్పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ జట్లకు వ్యత్యాసం చాలా తక్కువ' అని ఆకాశ్‌ చొప్రా ట్వీట్‌ చేశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మాజీ కోచ్‌ ట్రెంట్‌వుడ్‌హిల్‌ సైతం అంపైరింగ్‌ నిర్ణయంపై విమర్శలు చేశాడు. అందుబాటులో ఉన్న టెక్నాలజిని వాడుకోవాలని సూచించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios