Asianet News TeluguAsianet News Telugu

కరోనా కవచం: టాటా బుడగలలో ఐపీఎల్, ఏమేం సదుపాయాలంటే....

ఆదివారం సమావేశమైన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు టాటా గ్రూప్‌ మెడికల్‌ విభాగం బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఇతర కంపెనీల ప్రజెంటేషన్లను సైతం పరిశీలించిన బీసీసీఐ.. టాటా వైపు మొగ్గుచూపుతోందని సమాచారం.

IPL2020 : TATA To Provide The Bio Secure Bubble Atmosphere
Author
Mumbai, First Published Aug 4, 2020, 11:19 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరోనా దెబ్బకు పడకేసిన ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గనప్పటికీ.... దానితో కలిసి సహజీవనం చేయక తప్పదు అనే నిర్ణయానికి వచ్చిన ప్రపంచం.... ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ పరిస్థితులకు లోబడే క్రీడారంగం కూడా తన కార్యకలాపాలను ఆరంభించింది. 

యుఏఈలో ఐపీఎల్‌ నిర్వహణపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. సెప్టెంబర్‌ 19-నవంబర్‌ 10 వరకు నిర్వహిస్తామని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ప్రకటించింది. 

ఐపీఎల్‌ నిర్వహణకు స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్స్‌, ఎనిమిది బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టి, కోవిడ్‌19 ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపిక నిబంధనలు, విదేశీ ఆటగాళ్లను యుఏఈకి రప్పించటం, క్రికెటర్ల శిక్షణ శిబిరాల నిర్వహణ వంటి అంశాలపై స్పష్టత కోసం ప్రాంఛైజీలు, అభిమానులు ఎదురుచూశారు. 

షెడ్యూల్‌ ఖరారు, ఇతర అంశాలపై స్పష్టత రావటంతో ఇప్పుడు అందరి దృష్టి బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టిపై పడింది. బీసీసీఐ కార్యదర్శి జై షా త్వరలో ప్రాంఛైజీ యాజమాన్యాలతో సమావేశం కానున్నాడు. స్టాండర్ట్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్స్‌, కుటుంబ సభ్యులకు ప్రవేశం సహా బయో సెక్యూర్‌ బబుల్‌పై ప్రాంఛైజీలకు వివరించనున్నాడు. 

ఆదివారం సమావేశమైన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు టాటా గ్రూప్‌ మెడికల్‌ విభాగం బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఇతర కంపెనీల ప్రజెంటేషన్లను సైతం పరిశీలించిన బీసీసీఐ.. టాటా వైపు మొగ్గుచూపుతోందని సమాచారం.

టాటా ఏం చేయబోతుందంటే... 

ఐపీఎల్‌ను బయో సెక్యూర్‌ బబుల్‌లో నిర్వహించనున్నారు. కానీ కరోనా వైరస్‌ రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ బాధ్యత ఎవరు తీసుకోవాలి? లీగ్‌ మధ్యలో ఎవరికైనా కరోనా వైరస్‌ సోకితే ఏం చేయాలి? ఆటగాళ్ల కదలికలను ప్రాంఛైజీలు చూసుకోవాలా లేక బీసీసీఐ బాధ్యత తీసుకుంటుందా? అనేవి శేష ప్రశ్నలుగానే మిగిలాయి. 

కీలక బాధ్యతలను ప్రాంఛైజీలకు అప్పగించి అనిశ్చితికి తెరలేపకుండా చూస్తోంది. ఐపీఎల్‌ అన్ని ప్రాంఛైజీలు, బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టి బాధ్యతను టాటా గ్రూప్‌ మెడికల్‌ విభాగానికి అప్పగించింది. బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టి వ్యయాన్ని ప్రాంఛైజీలతో కలిసి బీసీసీఐ పంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్‌ నిర్వహణలో భాగంగా బయో సెక్యూర్‌ బబుల్‌లో టాటా గ్రూప్‌ అందిస్తోన్న సేవలపై స్పష్టమైన ప్రజెంటేషన్‌ ఇచ్చింది.

కరోనా పరీక్షలు.... 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు అవసరమైన వ్యూహంతో కోవిడ్‌ రోగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. కరోనా వైరస్‌ రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణలో అధునాతన పద్దతులను అవలంభించనున్నారు. క్రికెటర్లు యుఏఈకి బయల్దేరే ముందు కోవిడ్‌19 పరీక్షలు చేయటం, యుఏఈకి చేరుకున్న తర్వాత రోగ నిర్ధారణ పరీక్షలు చేయటం సహా లీగ్‌ సమయంలో ర్యాపిడ్‌ పరీక్షలు చేయనుంది. పరీక్షలు, ఫలితాలపై సమగ్ర సమాచార వ్యవస్థను రూపొందించనుంది.

జియో ట్యాగింగ్....  

ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లో క్రికెటర్లు, సహాయక సిబ్బంది, అధికారుల కదలికలపై టాటా గ్రూప్‌ బయో ట్యాగింగ్‌ ఇవ్వనుంది. బయో బబుల్‌లో క్రికెటర్ల ప్రతి కదలిలకలను ఇది నమోదు చేస్తుంది. కృత్తిమ మేధతో లైవ్‌ డ్యాష్‌ బోర్డులపై వీటిని ప్రదర్శితం చేయనున్నారు. లీగ్‌ మధ్యలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ వస్తే.. తదనంతర చర్యలు తీసుకోవటంలో జియో ట్రాకింగ్‌ వ్యవస్థ గొప్పగా ఉపయోగపడనుంది.

వైద్య సేవలు... 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఎవరు అనారోగ్యం బారిన పడినా, కరోనా వైరస్‌కు గురైనా వైద్య సేవల బాధ్యతలను పూర్తిగా టాటా గ్రూప్‌ చూసుకోనుంది. హెల్త్‌కేర్‌ నిర్వహణకు అబుదాబి, దుబాయి, షార్జా నగరాల్లోని ఆసుపత్రులతో అనుసంధానం కానుంది. 

ఐపీఎల్‌ సాగుతున్నంత కాలం టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని వైద్య నిపుణుల బృందం యుఏఈలోనే ఉంటుంది. నిపుణులైన ఎపిడమాలజిస్ట్‌లు, వైరాలజిస్ట్‌లు, బయాలజిస్ట్‌లు, ఇమ్యూనోలజిస్ట్‌లతో కూడిన వైద్య బృందం ఐపీఎల్‌లో 800 మంది సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు తీసుకోనుంది.

అంతేకాకుండా, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ), ఐపీఎల్‌ ప్రాంఛైజీలతో టాటా గ్రూప్‌ అనుసంధానం కానుంది. సమాచార మార్పిడిలో ఎటువంటి అంతరాయం కలుగకుండా, సమగ్ర వ్యవస్థను రూపొందించనుంది. 

ఐపీఎల్‌ ఆతిథ్య నగరాలు దుబాయి, అబుదాబి, షార్జాల్లో బయో సెక్యూర్‌ బబుల్స్‌ను సృష్టించనుంది. వీటితో పాటు, బయో సెక్యూర్‌ బబుల్‌లో భిన్న విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇన్నర్‌, అవుటర్‌ బబుల్స్‌లో ఇన్‌ఫెక్షన్‌ ప్రమాద శాతం ఆధారంగా విభజించారు. 

క్రికెటర్లు, కోచ్‌లు ప్లాటినం విభాగంలో ఉంటారు. ప్రసార సిబ్బంది గోల్డ్‌ విభాగంలో ఉంటే, మ్యాచ్‌ రోజు ఎంటర్‌టైనర్స్‌ సిల్వర్‌ విభాగాల్లో ఉండనున్నారు. భౌతిక దూరం పాటించటం కష్టసాధ్యమైన ప్రసారదారు సిబ్బంది, ఆటగాళ్లు అందరితో కలవాల్సిన సహాయక సిబ్బందికి కోవిడ్‌19 ప్రమాదం ఎక్కువగా ఉందని భావిస్తోన్న టాటా గ్రూప్‌ అందుకు తగిన జాగ్రత్తలు సైతం సూచించింది. 

ఐపీఎల్‌ ప్రాంఛైజీలతో సమావేశంలో పూర్తి వివరాలతో కూడిన బయో సెక్యూర్‌ బబుల్‌ వ్యవస్థను బీసీసీఐ ప్రకటించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios