Asianet News TeluguAsianet News Telugu

మారిన ఐపీఎల్ విన్నింగ్ ఫార్ములా: గెలుపు గుర్రాలు వీరే...!

మెరుగైన క్రికెట్‌ నైపుణ్యాలు ప్రదర్శించిన జట్టునే ఇన్నేండ్లూ ఐపీఎల్‌ టైటిల్‌ వరించింది. 2020 ఐపీఎల్‌లో ఈ ఫార్ములా మారనుంది.

IPL2020 : Success formula Has Changed Amongst The Teams
Author
Dubai - United Arab Emirates, First Published Sep 1, 2020, 4:34 PM IST

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ క్రికెట్‌లో బలవంతపు మార్పులకు కారణభూతమవుతోంది. కరోనా వైరస్‌ కారణంగా 100 రోజులకు పైగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ నిలిచిపోయింది. బయో సెక్యూర్‌ బబుల్‌లో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌ ఆరంభం కావటంతో అందరూ ఆనందించారు. 

కానీ మూడు టెస్టుల సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ క్రికెటర్లు ఏకంగా 70 రోజుల పాటు బయో సెక్యూర్‌ బబుల్‌లో గడిపారు. కరీబియన్‌ దీవుల నుంచి బ్రిటన్‌కు పయనం, అక్కడ 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ పూర్తి, అనంతరం రెండు బయో సెక్యూర్‌ బబుల్స్‌లో (మాంచెస్టర్‌, సౌతాంప్టన్‌) సిరీస్‌ కోసం గడిపారు. ఇప్పుడు పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌లు సైతం బయో సెక్యూర్‌ బబుల్‌లోనే సిరీస్‌ ఆడుతున్నారు. 

త్వరలో ఆస్ట్రేలియా సైతం ఇంగ్లాండ్‌లో బుడగ సిరీస్‌ ఆడనుంది. క్రికెట్‌ పున ప్రారంభానికి, క్రికెట్‌ బోర్డులు ఆర్థికంగా చితికిపోకుండా నిలుపుదల చేసేందుకు బయో సెక్యూర్‌ బబుల్‌ సిరీస్‌లో ఉపయోగపడుతున్నాయి. కానీ బయో సెక్యూర్‌ బబుల్‌ సిరీస్‌లో క్రికెటర్లు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

సుదీర్ఘ కాలం కుటుంబాలకు దూరంగా గడుపుతూ మానసికంగా కృంగిపోతున్నారు. ఈ పరిణామం తీవ్రంగా కలిచివేస్తోంది.కుటుంబాలకు దూరంగా, హౌటల్‌ గదిలో ఒంటరిగా, కరోనా భయంతో ఆందోళనగా గడుపుతున్న క్రికెటర్లకు ఇప్పుడు ఒత్తిడి రూపంలో పెను సవాల్‌ ఎదురవుతోంది. బబుల్‌ ఒత్తిడికి తాళలేక సురేశ్‌ రైనా ఐపీఎల్‌ 2020కి దూరమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడిని జయించేలా క్రికెటర్లను సిద్ధం చేయాలి.

ఒత్తిడిని జయించినవారే విజేత... 

ఐపీఎల్‌ అంటేనే నాణ్యమైన క్రికెట్‌కు చిరునామా. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు ఉన్నా, ఐపీఎల్‌ స్థాయి వేరు. అంతర్జాతీయ పోటీతత్వం ఐపీఎల్‌లో ఉట్టిపడుతుంది. ఐపీఎల్‌ విజేతలుగా నిలిచిన జట్లను చూసినా, ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. 

మెరుగైన క్రికెట్‌ నైపుణ్యాలు ప్రదర్శించిన జట్టునే ఇన్నేండ్లూ ఐపీఎల్‌ టైటిల్‌ వరించింది. 2020 ఐపీఎల్‌లో ఈ ఫార్ములా మారనుంది. మానసికంగా అత్యంత ధృడంగా నిలిచిన జట్టే ఐపీఎల్‌ విజేతగా నిలిచేందుకు ఆస్కారం ఉంటుంది. 

సైకాలజిస్టులు నీడలో... 

80 రోజుల ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లో మానసిక ఆరోగ్యం కీలక పాత్ర పోషించనుంది. ఇంగ్లాండ్‌ బయో సెక్యూర్‌ బబుల్‌ సిరీస్‌లను ఐపీఎల్‌తో పోల్చలేం. ఇక్కడ ఎనిమిది జట్లతో కూడిన మెగా టోర్నీలో నిత్యం కరోనా భయం వెంటాడుతూనే ఉంటుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంఛైజీలో 13 పాజిటివ్‌ కేసులు ఐపీఎల్‌ బబుల్‌లో ఆందోళనకు కారణమయ్యాయి.

ఐపీఎల్‌ బయో బబుల్‌ ప్రోటోకాల్స్‌లో ప్రతి ప్రాంఛైజీకి ఓ మెడికల్‌ ఆఫీసర్‌ ఉండాలి. కానీ బయో సెక్యూర్‌ బబుల్‌లో మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇప్పుడు సైకాలజిస్ట్‌ అవసరం ఏర్పడింది. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ప్రాంఛైజీ జట్టుతో పాటే మానసిక నిపుణులను ప్రత్యేక విమానంలో యుఏఈకి తీసుకెళ్లింది. మిగతా ప్రాంఛైజీలు బెంగళూర్‌ బాటలో నడిచేందుకు ఆలోచిస్తున్నాయి. క్వారంటైన్‌ గడువు పూర్తయిన తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వస్తారు. 

అప్పుడు ఫోకస్‌ పూర్తిగా క్రికెట్‌పైనే ఉంటుంది. కానీ ఆ సమయంలోనూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నామనే బెంగ క్రికెటర్లను వేధించే ప్రమాదం ఉంది. దీంతో 80 రోజుల బబుల్‌లో క్రికెటర్ల మానసిక ఆరోగ్యం కాపాడేందుకు ప్రాంఛైజీలు తప్పనిసరిగా సైకాలజిస్ట్‌లను జట్టుతో పాటు ఉంచాలి.

బీసీసీఐ అలెర్ట్.... 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంఛైజీలో 13 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో బీసీసీఐ అప్రమత్తమైంది. కోవిడ్‌19 బారిన పడిన 13 మందికి రోగ లక్షణాలు లేకపోవటం మరింత కలవరానికి గురి చేస్తోంది. 

సురక్షిత వాతావరణంలో ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ బృందం యుఏఈలో అహర్నిషలు కృషి చేస్తోంది. సూపర్‌ కింగ్స్‌ ఘటనతో ఇతర ప్రాంఛైజీలకు బోర్డు సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. క్వారంటైన్‌లో క్రికెటర్లను కచ్చితంగా హౌటల్‌ గదులకే పరిమితం చేసేలా సూచించింది. 

సూపర్‌ కింగ్స్‌ పాజిటివ్‌ కేసులతో, ఇతర ప్రాంఛైజీల క్రికెటర్లు సైతం ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 19న జరుగనున్న తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (తాత్కాలిక షెడ్యూల్‌ ప్రకారం) తలపడనున్న సంగతి తెలిసిందే!.

Follow Us:
Download App:
  • android
  • ios