Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు: కోహ్లీకి పరీక్ష, జట్టు గతి మారుతుందా?

అంచనాలు తక్కువగా ఉండటం సన్‌రైజర్స్‌కు ప్రతి సీజన్‌లో గొప్పగా ఉపయోగపడుతుంది. వరుస సీజన్లుగా కోర్‌ జట్టును అట్టిపెట్టుకున్న హైదరాబాద్‌, ఈ ఏడాది కొత్తగా యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకుంది. 

IPL2020 : RCB vs SRH Match Preview, Head to Head Record, Pitch Report And Other Stats
Author
Dubai - United Arab Emirates, First Published Sep 21, 2020, 9:02 AM IST

ఐపీఎల్‌లో ప్రతి సీజన్లో టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపించే జట్టు, కాగితంపై అతి భయానక జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌. స్టార్‌ క్రికెటర్లతో కూడిన బెంగళూర్‌కు అభిమానుల మద్దతు సైతం అదే రీతిలో లభిస్తుంది. 

ఇందుకు పూర్తి విరుద్ధం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.  స్టార్‌ క్రికెటర్లు, అభిమానుల మద్దతు, టైటిల్‌ ఫేవరేట్‌ ఇలా.. ఏ విభాగంలో చూసినా సన్‌రైజర్స్‌ టాప్‌-4లో నిలువదు. అయినా, 2016 నుంచి ప్రతి సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. 

2016లో టైటిల్‌ విజయం అందుకుంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మాత్రం ఇంకా తొలి టైటిల్‌ వేటలో విరామం లేని పోరు చేస్తూనే ఉంది.  2016 ఐపీఎల్‌ ఫైనలిస్ట్‌లు బెంగళూర్‌, హైదరాబాద్‌ నేడు దుబాయ్‌లో తలపడనున్నాయి.  వార్నర్‌ వర్సెస్‌ విరాట్‌ షో నేడు రాత్రి  7.30 గంటలకు ఆరంభం కానుంది.

అతిగా అధారపడొద్దు..

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ విరాట్‌ కోహ్లి పరుగుల వరదకు తిరుగు ఉండదు. గత సీజన్‌లో బెంగళూర్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.  విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లపై అతిగా ఆధారపడటమే బెంగళూర్‌ ప్రధాన బలహీనత అని చెప్పవచ్చు. 

ఈ సీజన్‌లో బెంగళూర్‌ శిబిరంలోకి కొత్తగా అరోన్‌ ఫించ్‌ వచ్చాడు. ఆసీస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ రాకతో బెంగళూర్‌ బ్యాటింగ్‌ మరింత ప్రమాదకరంగా మారనుంది.  పేస్ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరీస్‌ను కోరి మరీ తెచ్చుకున్న కోహ్లిసేన.. అతడికి తోడుగా సఫారీ స్పీడ్‌ గన్‌ డేల్ స్టెయిన్‌ను సైతం బరిలోకి దింపనుంది. 

స్పిన్‌ విభాగంలో యుజ్వెంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, పవన్‌ నేగి సహా ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీ రూపంలో నాణ్యమైన వనరులు అందుబాటులో ఉన్నాయి.  డెత్‌ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకునే అలవాటును బెంగళూర్‌ ఆరంభం నుంచే వదులుకోవాలి. లేదంటే, యుఏఈలోనూ కోహ్లిసేనకు భంగపాటు తప్పదు.

ఉత్సాహంగా ఆరెంజ్‌ ఆర్మీ...

అంచనాలు తక్కువగా ఉండటం సన్‌రైజర్స్‌కు ప్రతి సీజన్‌లో గొప్పగా ఉపయోగపడుతుంది. వరుస సీజన్లుగా కోర్‌ జట్టును అట్టిపెట్టుకున్న హైదరాబాద్‌, ఈ ఏడాది కొత్తగా యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకుంది. 

డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో రూపంలో ఇద్దరు ధనాధన్‌ ఓపెనర్లు హైదరాబాద్‌ సొంతం. మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌లు మిడిల్‌ ఆర్డర్‌ను బలోపేతం చేస్తున్నారు. యువ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ సింగ్‌, అబ్దుల్‌ సమద్‌, ప్రియం గార్గ్‌లలో ఒకరు లోయర్‌ ఆర్డర్‌లో రానున్నారు. 

బౌలింగ్‌ విభాగంలో సన్‌రైజర్స్ ఎప్పట్లాగే పటిష్టంగా కనిపిస్తోంది.  భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌లు పేస్‌ బాధ్యతలు పంచుకోనుండగా.. రషీద్‌ ఖాన్‌తో కలిసి మహ్మద్‌ నబి స్పిన్‌ బాధ్యతలు చూసుకోన్నాడు.

చెరో మ్యాచ్‌....!

ఐపీఎల్‌లో బెంగళూర్‌తో ముఖాముఖిలో హైదరాబాద్‌ 8-6తో ముందంజలో కొనసాగుతుంది. అయితే, ఏ సీజన్‌లోనూ లీగ్‌ దశలో రెండు మ్యాచులను ఒకే జట్టు నెగ్గలేదు. ప్రతి సీజన్‌లో బెంగళూర్‌, హైదరాబాద్‌లు చెరో మ్యాచ్‌లో విజయం సాధిస్తున్నాయి. గత ఐదు మ్యాచుల్లో బెంగళూర్‌, హైదరాబాద్‌ చెరో రెండు విజయాలు నమోదు చేయగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

ఎక్స్‌ ఫ్యాక్టర్‌..

వరల్డ్‌ నం.1 టీ20 స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను యుఏఈలో ఎదుర్కొవటం బెంగళూర్‌‌కు కష్టమే. ఎమిరేట్స్‌ పిచ్‌లపై రషీద్‌ ఖాన్‌ ఎకానమీ రేటు కేవలం 5.6. టీ20 క్రికెట్‌లో మరో స్పిన్నర్‌కు ఈ స్థాయి గణాంకాలు లేవు. నెమ్మదిగా స్పందించే దుబాయ్‌ పిచ్‌పై నాణ్యమైన స్పిన్‌పై పరుగుల వేట ఇరు జట్లకు కష్టసాధ్యమే కానుంది. బెంగళూర్‌ మిడిల్‌ ఆర్డర్‌పై రషీద్‌ ఖాన్‌ను ప్రయోగించేందుకు వార్నర్‌ స్పష్టమైన ప్రణాళికతో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు బాదిన విరాట్‌ కోహ్లి సన్‌రైజర్స్‌పై చెత్త రికార్డును కలిగి ఉన్నాడు. 2018 ఐపీఎల్‌ నుంచి హైదరాబాద్‌పై విరాట్‌ బ్యాటింగ్‌ సగటు 17.5 మాత్రమే. స్టయిక్‌రేట్‌ సైతం 121గానే ఉంది. అన్ని జట్లపై తిరుగులేని రికార్డులు కలిగిన విరాట్‌.. యుఏఈ వేదికగా సన్‌రైజర్స్‌పై రికార్డును సరిచేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డెవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, విరాట్‌ సింగ్‌, అబ్దుల్‌ సమద్‌, మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు‌: అరోన్‌ ఫించ్‌, దేవదత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌ (వికెట్‌ కీపర్‌), మోయిన్‌ అలీ, శివం దూబె, క్రిస్‌ మోరీస్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, యుజ్వెంద్ర చాహల్‌.  

Follow Us:
Download App:
  • android
  • ios