దుబాయ్: కరోనా నిబంధనలు అతిక్రమించేలా వ్యవహరించి ఆ వెంటనే తప్పు తెలుసుకుని అంపైర్ కి క్షమాపణలు చెప్పాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ ఘటన నిన్న(సోమవారం) డిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చోటుచేసుకుంది. 

కరోనా మహమ్మారి లాలాజలం(ఉమ్మి) కారణంగా వ్యాప్తి చెందే అవకాశం వుండటంతో మ్యాచ్ సమయంలో బంతిని ఉమ్మితో రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. అయితే ఇలా చేయడం బాగా అలవాటున్న ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా కాకున్నా పొరపాటును ఉమ్మితో బంతిని రుద్దుతున్నారు. ఐపిఎల్ సీజన్ 13లో ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలాగే చేశాడు. 

IPL 2020: రాబిన్ ఊతప్ప... అందరూ చూస్తుండగా ఇదేం పనయ్యా...

బెంగళూరు బౌలర్ నవదీప్‌ సైని వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో డిసి ఓపెనర్ పృథ్వీ షా కొట్టిన బంతిని షార్ట్‌ కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి అడ్డుకున్నాడు. ఇలా తన చేతిలోకి వచ్చిన బంతిపై ఉమ్మి రుద్దేందుకు ప్రయత్నించాడు. నోట్లోంచి ఉమ్మిని చేతివేళ్లకు అంటించుకుని బంతిపై వేళ్లు పెట్టాడు. ఇంతలో ఐసిసి నిబంధన గుర్తుకువచ్చి వెనక్కి తగ్గిన కోహ్లీ పొరపాటును క్షమించాలి అన్నట్లుగా అంపైర్ కు రెండు చేతులెత్తి నమస్కరించాడు. 

అయితే ఇటీవల రాజస్థాన రాయల్స్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప కూడా పొరపాటునో, అలవాటునో బాల్‌పై ఉమ్మిరాస్తూ దొరికిపోయాడు.కరోనా వైరస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ దొరికిపోయిన రాబిన్ ఊతప్ప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే కోహ్లీ కూడా అలాగే చేసి వెంటనే పొరపాటును గుర్తించాడు.