ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభానికి ముందు టైటిల్‌ ఫేవరేట్‌ రేసు లో అందరి నోటా ముంబయి ఇండియన్స్‌ మాటే. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని శాసించగల ఐదుగురు విధ్వంసక బ్యాట్స్‌మెన్‌, డెత్‌ ఓవర్లలో ప్రమాదకర పేసర్లు, లోయర్ ఆర్డర్‌లోనూ ధాటిగా పరుగులు చేయగల ఆటగాళ్లు ముంబయి సొంతం. 

కానీ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ తర్వాత ఈ అభిప్రాయంలో మార్పు వచ్చినట్టు చెప్పవచ్చు. ముంబయి ఇండియన్స్‌లోనూ బలమైన బలహీనతలు ఉన్నాయని చెన్నై సూపర్‌కింగ్స్‌ నిరూపించింది. చెన్నై చూపిన దారిలో నడిచేందుకు కోల్‌కత నైట్‌రైడర్స్‌ సిద్ధమవుతోంది.

తొలి విజయం వేటలో..

యునైట్‌డ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ)లో ముంబయి ఇండియన్స్‌ తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. 2014లో ముంబయి ఇండియన్స్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచినా, యుఏఈలో జరిగిన తొలి దశ మ్యాచుల్లో ఒక్క విజయమూ సాధించలేదు. ఐదు మ్యాచులు ఆడగా, అన్నింటా పరాజయం పాలైంది. 

తాజాగా 2020 ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ఓటమిపాలైంది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌, రోహిత్‌ శర్మలు టచ్‌లో కనిపించినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మిడిల్‌ ఆర్డర్‌లో సౌరభ్‌ తివారీ మెప్పించినా.. బిగ్‌ హిట్టర్లు కీరన్‌ పొలార్డ్‌, హార్ధిక్‌ పాండ్యల నుంచి ముంబయి ఎంతో ఆశిస్తోంది. 

తొలి మ్యాచ్‌లో యార్కర్ల హీరో జశ్‌ప్రీత్‌ బుమ్రా రాణించలేదు. రాయుడుకి భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ జతగా బుమ్రా నేటి మ్యాచ్‌లో సత్తా చాటాల్సి ఉంది.

కోల్‌కతను ఆపగలరా?...

ఐపీఎల్‌లో అత్యంత విధ్వంసకర, ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ అండ్రీ రసెల్‌. 2019 ఐపీఎల్‌లో ఒంటిచేత్తో కోల్‌కతకు విజయాలు అందించాడు రసెల్‌. యుఏఈలోనూ రసెల్‌ను ఆపటం అంత సులువు కాదు. ఈ సీజన్లో రసెల్‌కు తోడు ఇయాన్‌ మోర్గాన్‌ వచ్చాడు. ఈ భారీ హిట్టర్ల దాడి నుంచి తప్పించుకోవటం బౌలర్లకు అంత సులువు కాదు. 

యువ కెరటం శుభ్‌మన్‌ గిల్‌పై కోల్‌కత ఎన్నో ఆశలు పెట్టుకుంది.  నితీశ్‌ రానా, రాహుల్‌ త్రిపాఠి సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. బౌలింగ్‌ విభాగంలో కమలేశ్‌ నాగర్‌కోటిపై అంచనాలు ఉన్నాయి. పాట్‌ కమిన్స్‌, కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి సునీల్‌ నరైన్‌ బంతితో బాధ్యతలు పంచుకోనున్నాడు.

ఇద్దరికీ సొంత మైదానమే!

ఐపీఎల్‌ 2020లో ఆరు ప్రాంఛైజీలు దుబాయ్‌ కేంద్రంగా బస చేయగా.. రెండు ప్రాంఛైజీలు మాత్రమే అబుదాబిలో ఉంటున్నాయి. ఈ సీజన్‌లో సొంత మైదానం భావన, అనుకూలతలు లేకపోయినా.. బస చేస్తోన్న నగరాన్ని సొంత మైదానంగా భావించవచ్చు. ఈ లెక్కన నేడు అబుదాబిలో కోల్‌కత నైట్‌రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌లు తమ సొంత మైదానంలోనే పోటీపడుతున్నాయి.  

అబుదాబి పిచ్ నెమ్మదిగానే స్పందిస్తోంది. ఛేదనలో ఇరు జట్లకు భారీ హిట్టర్ల అండ ఉన్నా, తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉండనున్నాయి.  కోల్‌కతకు రసెల్‌, నరైన్‌.. ముంబయికి పొలార్డ్‌, కృనాల్‌ కీలకం కానున్నారు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)..

కోల్‌కత నైట్‌రైడర్స్‌.. శుభ్‌మన్‌ గిల్‌, సునీల్‌ నరైన్‌, నితీశ్‌ రానా, ఇయాన్‌ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), అండ్రీ రసెల్‌, రాహుల్‌ త్రిపాఠి/ రింకూ సింగ్‌, పాట్‌ కమిన్స్‌, కుల్దీప్‌ యాదవ్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, ప్రసిద్‌ కృష్ణ.

ముంబయి ఇండియన్స్‌.. రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్‌ తివారి, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, జేమ్స్‌ పాటిన్సన్‌,  రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.