Asianet News TeluguAsianet News Telugu

ముంబై వర్సెస్ చెన్నై: దిగ్గజాల పోరులో గెలుపెవరిది?

తొలి మ్యాచ్‌లోనే దిగ్గజాలు ఢీ కొంటున్నాయి. నాలుగు సార్లు టైటిల్‌ విజేత ముంబయి ఇండియన్స్‌, మూడుసార్లు టైటిల్‌ విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌లు ఐపీఎల్‌ 2020 ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి.

IPL2020 : MI VS CSK Match preview, Probable Playing 11 And Winning Chances
Author
Abu Dhabi - United Arab Emirates, First Published Sep 19, 2020, 10:08 AM IST

ఆలస్యం జరిగినా ఆరంభం అద్భుతంగా ఉండనుంది. ఇది మనం ఇదివరకు చూసిన ఐపీఎల్‌ వంటిది కాదు. కానీ ప్రస్తుత కరోనా టెన్షన్ నుంచి కచ్చితంగా ఊరట ఇవ్వగలదు. 

స్టేడియంలో ప్రేక్షకుల గోల లేదు. బౌండరీ లైన్‌ దగ్గర ఛీర్‌లీడర్స్‌ డ్యాన్స్‌ ఉండదు. అయినా, ఉత్కంఠకు కొదవలేదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నేటి నుంచి ఆరంభం కానుంది. 

తొలి మ్యాచ్‌లోనే దిగ్గజాలు ఢీ కొంటున్నాయి. నాలుగు సార్లు టైటిల్‌ విజేత ముంబయి ఇండియన్స్‌, మూడుసార్లు టైటిల్‌ విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌లు ఐపీఎల్‌ 2020 ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. గత సీజన్ల కంటే అరగంట ముందుగానే (రాత్రి 7.30) ఐపీఎల్‌ సందడి షురూ కానుంది.

ఐపీఎల్‌లో ఎన్నో జట్ల మధ్య ఆసక్తికర వైరం నడుస్తోంది. కానీ టైటిళ్ల వేటలో చిరకాల ప్రత్యర్థులు ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ అనే చెప్పాలి. ముంబయి ఇండియన్స్‌ టైటిల్‌ నెగ్గిన నాలుగు సీజన్లలో ప్రత్యర్థి శిబిరంలో ధోని ఉండటం గమనార్హం. మూడుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్‌ను, ఓసారి పుణె సూపర్‌జెయింట్స్‌ను జయించి ముంబయి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. గత సీజన్లో నరాలు తెగే ఉత్కంఠకర మ్యాచ్‌లో చెన్నైపై 1 పరుగు తేడాతో ముంబయి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌ 2019 ఫైనల్స్‌ రీ మ్యాచ్‌తో ఆరంభం కానుంది.

జట్ల బలాబలాలు.... 

వ్యూహం పరంగా రెండు జట్లకూ అనుకూలతలు ఉన్నాయి. స్లాగ్‌ ఓవర్లలో (16-20) దూకుడుగా పరుగులు పిండుకునే ఎం.ఎస్‌ ధోనిపై జస్ప్రీత్‌ బుమ్రాను ప్రయోగించేందుకు ముంబయి సిద్ధంగా ఉండగా, విధ్వంసకర రోహిత్‌ శర్మకు దీపక్‌ చాహర్‌ అస్త్రాన్ని సూపర్‌కింగ్స్‌ రెడీ చేసుకుంది. 

బిగ్‌ హిట్టర్‌, ప్రమాదకర ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ అందుబాటులో ఉన్నా డికాక్‌, రోహిత్‌ శర్మ జోడీనే ముంబయి ఇన్నింగ్స్‌ను ఆరంభించనుంది. అబుదాబి పిచ్‌, పరిస్థితులు సూపర్‌కింగ్స్‌ బలానికి సరితూగుతాయి. 

అయితే స్పిన్‌పై ఎక్కువగా ఆధారపడే ధోనీసేన.. పాండ్య బ్రదర్స్‌, రోహిత్‌, పొలార్డ్‌లకు ప్రత్యామ్నాయ వ్యూహంతో రావాల్సి ఉంది. నాణ్యమైన పేస్‌ బౌలర్లను కలిగి ఉన్న ముంబయి ఇండియన్స్‌ స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో మ్యాజిక్‌ చేయగల ధీమాతో కనిపిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న మ్యాచ్‌ కావటంతో మానసికంగా ఆరంభ మ్యాచ్‌లో క్రికెటర్ల ప్రదర్శన ఆసక్తికరంగా మారింది.

ఇక అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నా.. టాప్‌ ఆర్డర్‌లో సూపర్‌కింగ్స్‌ బలహీనతలు సుస్పష్టం. సురేశ్‌ రైనా లేని లోటు ధోనీసేనకు గట్టి ఎదురుదెబ్బ. రైనా స్థాయికి తగ్గ బ్యాట్స్‌మన్‌ మరొకరు సూపర్‌కింగ్స్‌ టాప్‌ ఆర్డర్‌లో కనిపించటం లేదు. 

కరోనా నుంచి కోలుకున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదు. కుదించిన క్వారంటైన్‌ నిబంధనలతో కంగారూ స్పీడ్‌గన్‌ జోశ్‌ హెజిల్‌వుడ్‌ ఆరంభ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడు. ఐపీఎల్‌ దిగ్గజ జట్ల మధ్య పోరులో ఫలితం ఎటూ మొగ్గుచూపినా.. విరామం తర్వాత క్రికెట్‌ అభిమానులకు పసందైన మ్యాచ్‌ విందు ఖాయం.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

చెన్నై సూపర్‌కింగ్స్‌ : షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, డుప్లెసిస్‌, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌కీపర్‌), కేదార్‌ జాదవ్‌, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, పియూశ్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌, షార్దుల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌.

ముంబయి ఇండియన్స్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, నాథన్‌ కౌల్టర్‌నైల్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.

Follow Us:
Download App:
  • android
  • ios