ఎం.ఎస్‌ ధోని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఉన్న సమయంలో నాయకత్వ వారసుడు ఎవరనే అంశంపై అందరికీ ఓ స్పష్టత ఉండేది.  బ్యాట్స్‌మన్‌గా అప్పటికే ఎదురులేని రికార్డులు సాధించిన విరాట్‌ కోహ్లి దిగ్గజ ధోని నుంచి ఆసీస్‌ పర్యటన మధ్యలోనే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.  

సూపర్‌ ప్రదర్శనలతో భారత్‌ను మూడు ఫార్మాట్లలోనూ అగ్రజట్టుగా నిలిపాడు కోహ్లి. క్రికెట్‌ సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి ఇప్పుడిప్పుడే 30 ప్లస్‌లోకి అడుగుపెట్టాడు.  ఐపీఎల్‌లో నాలుగు టైటిల్‌ విజయాలతో నాయకత్వ ప్రతిభను చాటుకున్న రోహిత్‌ శర్మ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. కానీ రోహిత్‌, విరాట్‌లు ఇద్దరూ సమ వయస్కులు. దీంతో భవిష్యత్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పేరును పరిగణనలోకి తీసుకోవటం లేదు.

క్రికెట్‌ అభిమానులతో పాటు విశ్లేషకులు సైతం ఫ్యూచర్‌ కెప్టెన్‌ ఎవరనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.  ఐపీఎల్‌లో రెండు టైటిళ్లు సాధించిన గౌతం గంభీర్‌ నుంచి 2018 సీజన్‌ మధ్యలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న యువ శ్రేయాష్‌ అయ్యర్‌, 2020 సీజన్లోనే కెప్టెన్‌గా అరంగ్రేటం చేయబోతున్న కెఎల్‌ రాహుల్‌ భారత క్రికెట్‌ జట్టు భవిష్యత్‌ కెప్టెన్‌ రేసులో ఉన్నారు.  

కోల్‌కత నైట్‌రైడర్స్‌ నుంచి సొంత రాష్ట్ర జట్టుకు వచ్చిన గంభీర్‌.. ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. ఆ సీజన్లో ఢిల్లీ 5 విజయాలే సాధించింది. సీజన్‌ మధ్యలోనే గంభీర్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న అయ్యర్‌ జట్టును గెలుపు బాట పట్టించాడు. 2019 సీజన్లో ఢిల్లీని లీగ్‌ దశలో గెలుపు ట్రాక్‌లోనే నడిపాడు. 

14 మ్యాచుల్లో క్యాపిటల్స్‌ 9 విజయాలు సాధించింది. ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలుపొందినా.. చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో పరాజయంతో ఫైనల్లోకి చేరుకునే అవకాశం చేజార్చుకుంది. ఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఢిల్లీని అయ్యర్‌ ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. జాతీయ జట్టులోనూ అయ్యర్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శనలతో రాణిస్తున్నాడు.

క్రికెట్‌ దిగ్గజం, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌కు మాత్రం భవిష్యత్‌ కెప్టెన్‌పై ఓ అంచనా ఉన్నట్టు తెలుస్తోంది.  ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్సీ వహించబోతున్న కెఎల్‌ రాహుల్‌ భారత భవిష్యత్‌ కెప్టెన్‌గా నిలిచే అవకాశం ఉందని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. 

'ఎప్పుడు బాధ్యత అందించినా, రాహుల్‌ పరుగుల వరద పారించాడు. ఓ జట్టుకు సారథ్యం వహించి, విజయ తీరాలకు చేర్చగల సామర్థ్యం రాహుల్‌ సొంతం. రాహుల్‌ ఇదే రీతిలో కొనసాగితే, భారత జట్టుకు త్వరలోనే వైస్‌ కెప్టెన్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, అజింక్య రహానెలు ఉన్నా.. ముందుచూపుతో ఆలోచన చేసినప్పుడు రాహుల్‌ సెలక్షన్‌ కమిటికి కనిపిస్తాడు. కెప్టెన్‌గా కెఎల్‌ రాహుల్‌కు ఐపీఎల్‌ 2020 అత్యంత కీలకం' అని సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు.

'జాతీయ జట్టు నాయకత్వ పగ్గాలు ఏదో ఒక సమయంలో తర్వాతి తరానికి అందించాల్సినదే. విరాట్‌ కోహ్లికి ఎం.ఎస్‌ ధోని గొప్పగా నాయకత్వ మార్పిడి చేశాడు. విరాట్‌ కోహ్లి తన తర్వాత నాయకుడిని అదే రీతిలో ఎంచుకోవాలి. కోహ్లి, రోహిత్‌,రహానె సమ వయస్కులు. కెప్టెన్‌గా రాహుల్‌ మెరుగ్గా రాణిస్తాడని  అనుకుంటున్నా. మ్యాచ్‌లో వ్యూహలను ఏవిధంగా అమలు చేస్తాడు, జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడనే అంశాలు కీలకం అవుతాయి. కెప్టెన్సీ రేసులో రాహుల్‌ ముందున్నాడు' అని ఆకాశ్‌ చొప్రా ఫేస్‌బుక్‌ పేజిలో రాసుకొచ్చాడు.

భారత భవిష్యత్‌ కెప్టెన్సీ రేసులో పోటీపడుతున్న కెఎల్‌ రాహుల్‌, శ్రేయాష్‌ అయ్యర్‌లు నేడు ఐపీఎల్‌లో ముఖాముఖి పోటీపడనున్నారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో పాటు మైదానంలో ఇద్దరు నాయకులు తమ ప్రణాళికలు అమలు చేసే తీరు, తమ వ్యూహంతో ప్రత్యర్థిని ఎలా ఇరుకున పడేస్తారనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.