కెప్టన్సీలో ఎం.ఎస్‌ ధోని ప్రస్థానం శిఖర సమానం. మైదానంలో అతడు తీసుకునే నిర్ణయాలు అనూహ్యం. అంచనాలకు అందని నిర్ణయాలతో ప్రత్యర్థులను తికమక పెడుతూ, సులువుగా జట్టును గెలుపు తీర్చాలకు చేర్చటం మహి స్టయిల్‌.  

బ్యాట్స్‌మన్‌గా ధోని ప్రదర్శనపై విమర్శలు వచ్చాయే గానీ, కెప్టెన్‌గా ధోనిపై ఎవరూ, ఎన్నడూ వేలెత్తి చూపలేదు.  భారత జట్టుకు గుడ్‌బై చెప్పిన తర్వాత, బయో సెక్యూర్‌ బబుల్‌లో మహి తన నాయకత్వ నిర్ణయా లను ప్రశ్నార్థకం చేసుకోవటం విచిత్రంగా ఉంది.  ఐపీఎల్‌లో రెండు టైటిళ్లు నెగ్గిన కెప్టెన్‌, ధోని మాజీ సహచరుడు గౌతం గంభీర్‌ మహిపై విమర్శలు గుప్పించాడు.

'చెన్నై లక్ష్యం 217 పరుగులు. ఇంత భారీ స్కోరు ఛేదనలో ఎం.ఎస్‌ ధోని నం.4 లేదా నం.5 స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. కానీ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మురళీ విజయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శామ్‌ కరన్‌లు ధోని కంటే ముందు క్రీజులోకి వచ్చారు.  అంటే వీళ్లంతా ధోని కంటే మెరుగైన బ్యాట్స్‌మెన్‌ అని అనుకోవాలా? కెప్టెన్‌గా ముందుండి నడిపించటం అంటే ఇదేనా? 200 ప్లస్‌ పరుగుల ఛేదనలో ఏడో స్థానంలో వచ్చి ధోని జట్టును ఏ విధంగా ముందుండి నడిపిస్తాడు. ఇది పూర్తిగా మతిలేని చర్య. ఆఖర్లో ధోని చేసిన పరుగులు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అది కేవలం ధోని వ్యక్తిగత స్కోరుకు పనికొచ్చింది.  217 పరుగుల ఛేదనలో మరే కెప్టెన్‌ ఏడో స్థానంలో వచ్చినా, విమర్శలు చెలరేగేవి. కానీ ఈ పని ధోని చేయటంతో పెద్దగా విమర్శలు రావటం లేదు. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని తీసుకున్న నిర్ణయం మతిలేనిది. ఈ మ్యాచ్‌లో మహి కెప్టెన్సీ సైతం పేలవం' అని గంభీర్‌ విమర్శించాడు.

మహేంద్ర సింగ్‌ ధోనిపై విమర్శలు చేయడానికి గంభీర్‌ ఎప్పుడైనా ఏమాత్రం వెనుకాడలేదు. గతంలో మహిపై గంభీర్‌ విమర్శలతో ఏకీభవించిన వారూ లేరు. కానీ రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ విషయంలో అభిమానులు సైతం గంభీర్‌ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. 

217 పరుగుల ఛేదనలో ఇన్నింగ్స్‌ 14 ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. డుప్లెసిస్‌కు ఏమాత్రం సహకరించలేదు. ఆఖర్లో చెన్నై ఓటమి ఖరారైన తర్వాత, హ్యాట్రిక్‌ సిక్సర్లతో చెలరేగాడు. చెన్నై స్కోరును 200 మార్క్‌కు చేర్చాడు. డుప్లెసిస్‌ తోడుగా ధోని ముందే బ్యాట్‌కు పని చెప్పి ఉంటే షార్జా పోరులో ఫలితం భిన్నంగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  భారీ స్కోర్ల మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.