కరోనా మహమ్మారి దెబ్బకు క్రికెట్ పూర్తిగా  పక్కకు పడిపోయింది. ఇప్పుడిప్పుడే తిరిగి ఆట ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సైతం ఐపీఎల్ నిర్వహణను తలపెట్టింది. ఈ కరోనా వేళ ఐపీఎల్ నిర్వహణ కత్తి మీద సాము వంటిది.  ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించవలిసి ఉంటుంది. 

ఇందుకోసం, భారత క్రికెట్‌ నియంత్రణమండలి(బిసిసిఐ) సుమారు రూ.10 కోట్లతో యుఏఇలో కరోనా టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి సుమారు 20వేలకు పైగా కరోనా టెస్టులు జరపనున్నట్లు సమాచారం. 

భారత్‌లో ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా పరీక్షల ఖర్చును ఎనిమిది ఫ్రాంఛైజీలు భరించగా... యుఏఇలో అడుగుపెట్టిన దగ్గరనుంచి టోర్నీ ముగిసే వరకు జరిపే ఆర్‌టి-పిసిఆర్‌ టెస్టుల ఖర్చును బిసిసిఐ భరించనుంది. 

'మేం కరోనా పరీక్షలు నిర్వహించడానికి యుఏఇకి చెందిన విపిఎస్‌ హెల్త్‌కేర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 20వేలకు పైగా ఉంటుందని, పన్నులు కాకుండా ప్రతి పరీక్షకు బిసిసిఐ సుమారు రూ.4 వేలు(200 దిర్హామ్‌) చెల్లిస్తుందని' ఐపిఎల్‌ సీనియర్‌ అధికారి తెలిపారు. 

'మేం రిస్క్‌ తీసుకోదల్చుకోలేదు, ఓ హోటల్‌లో ప్రత్యేక బయో-బబుల్‌కే కేటాయించబడిందని, అందులో 50మంది కరోనా పరీక్షలు చేస్తున్నారని, మరో 25మంది ల్యాబ్‌, డాక్యుమెంట్‌ ప్రక్రియలో నిమగమయ్యారని' ఆయన తెలిపారు. సెప్టెంబర్‌ 20-28మధ్య 1,988 మంది కరోనా పరీక్షలకు హాజరయ్యారైనట్లు తెలిసింది.