ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్లు విజ్డెన్‌ టెస్టు సిరీస్‌ కోసం సుమారు 70 రోజులు బయో సెక్యూర్‌ బబుల్‌లో ఉన్నాయి. పాకిస్థాన్‌తో సిరీస్‌కు సైతం ఇంగ్లాండ్‌ నెల రోజులుగా బుడగలోనే ఉంటోంది. ఈ రెండు బయో బబుల్స్‌లో ఎక్కడా ఆందోళన కలిగించే పరిణామాలు చోటుచేసుకోలేదు. 

మాంచెస్టర్‌, సౌతాంప్టన్‌ ఇలా బబుల్‌ ఏదైనా ఒక్క కోవిడ్‌19 పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. కానీ 53 రోజుల మెగా ఐపీఎల్‌కు ముందు బయో సెక్యూర్‌ బబుల్‌లో 13 కరోనా వైరస్‌ కేసులు నమోదు కావటం క్రికెటర్లలో ఆందోళన రేపుతోంది. 

ఐపీఎల్‌ బయో బబుల్‌లో కరోనా కేసుల ఆందోళనతో టి20 ఫార్మాట్‌ సూపర్‌ స్టార్‌ సురేశ్‌ రైనా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. యుఏఈ నుంచి భారత్‌కు తిరిగొచ్చాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌ రైనా. 

ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు కూల్చిన లసిత్‌ మలింగ (170 వికెట్లు) సైతం 13 సీజన్‌కు దూరమయ్యాడు. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ ఐపీఎల్‌ 2020కి దూరమయ్యారు. కరోనా ఒత్తిడితో మరికొందరు క్రికెటర్లు సైతం బయో సెక్యూర్‌ ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

బబుల్‌పై అనుమానాలు! 

ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లో 13 కరోనా వైరస్‌ కేసులు నమోదు కావటం అందరినీ షాక్‌కు గురి చేసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ శిబిరంలో 13 కేసులు వెలుగు చూడటంతో క్రికెటర్లు ఉలిక్కి పడ్డారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ కంగారును వ్యక్తం చేశారు. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో గురువారం చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌.. ఐపీఎల్‌ బబుల్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ' 13 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావటం బ్యాడ్‌ న్యూస్‌. కోవిడ్‌19 బారిన పడిన వారికెవరికీ రోగ లక్షణాలు లేకపోవటం మరింత జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. కోవిడ్‌ కేసులు ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌పైన్నే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి' అని కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు.

ఆందోళన ఎందుకు? : 

ఐపీఎల్‌ 8 ప్రాంఛైజీల్లో ఏడు శిబిరాల్లో అంతా సవ్యంగానే సాగుతోంది. ఒక్క చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్రాంఛైజీలోనే 13 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఓ సారి నిర్వహించిన కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌ వచ్చింది. సెప్టెంబర్‌ 3న మరోసారి నెగెటివ్‌ వస్తే అందరూ తిరిగి బబుల్‌లోకి రానున్నారు. 

మిగతా ప్రాంఛైజీలతో వీరెవరికీ సంబంధాలు లేవు. అయినా, ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అంటే అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. 

ఇంగ్లాండ్‌ పర్యటనకు బయల్దేరే ముందు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టులో సైతం కోవిడ్‌19 కేసులు వెలుగుచూశాయి. కానీ ఐపీఎల్‌ ప్రోటోకాల్‌ ప్రకారం కనీసం రెండు సార్లు నెగెటివ్‌ వస్తేనే యుఏఈ విమానం ఎక్కేందుకు అనుమతి. 

ప్రతి ప్రాంఛైజీ క్రికెటర్లను స్వీయ క్వారంటైన్‌లోనే ఉండమని ఆదేశించింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదు రోజుల శిక్షణ శిబిరానికి ముందు పరీక్షలు నిర్వహించింది. క్రికెటర్ల క్యాంప్‌ సమయంలోనూ పరీక్షలు చేశారు. విమాన ప్రయాణానికి ముందు మరోసారి కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేశారు. ఇక్కడా ఎక్కడా పాజిటివ్‌ రాకుండా.. బబుల్‌లోకి ప్రవేశించిన వారికి యుఏఈలో పాజిటివ్‌ రావటం కలవరానికి కారణం. 

రెండు నెలల సుదీర్ఘ టోర్నీలో ఇదే తరహాలోనే మళ్లీ ఏ ప్రాంఛైజీలోనైనా అలక్షణ కోవిడ్‌19 కేసులు నమోదైతే క్రికెటర్లు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది. అదే పాజిటివ్‌ కేసులు రాజస్థాన్‌ రాయల్స్‌లోనూ నమోదయ్యాయి. కానీ అవి బబుల్‌కు బయట నిర్థారణ అయ్యాయి. ప్రాంఛైజీ బబుల్‌లో కేసులు నమోదు కావటంతో ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బుడగపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

రైనా బాటలోనే...!  

బయో సెక్యూర్‌ బబుల్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెటింగ్ టాలెంట్ ను పక్కకు నెట్టి.. మానసిక ధృడత్వంపై ఫోకస్‌ను మరల్చింది. ప్రతి ప్రాంఛైజీ సైకాలజిస్ట్‌లను నియమించుకునే పనిలో నిమగమయ్యాయి. 

అయితే, సురేశ్‌ రైనా బాటలోనే మరికొందరు క్రికెటర్లు ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించే అవకాశం కనిపిస్తోందని మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ ప్యాడీ అప్టన్‌ అభిప్రాయపడ్డాడు. ' ఈ ఐపీఎల్‌లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకోనున్నాయి. అభిమానులతో కిక్కిరిసిన మైదానాల్లో నాన్‌ క్రికెటింగ్‌ అంశాలతో ప్రేరణ పొంది రెచ్చిపోయే ఆటగాళ్లకు ఇప్పుడు ఆ కిక్‌ ఉండదు. మైదానంలో ఒత్తిడికి లోనయ్యే క్రికెటర్లు ఇప్పుడు ఖాళీ స్టేడియాల్లో ఆటపై పూర్తి దృష్టి నిలిపనున్నారు. విరాట్‌ కోహ్లి వంటి క్రికెటర్ల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. మానసిక ఒత్తిడితో కూడుకున్న బయో సెక్యూర్‌ బబుల్‌ ఐపీఎల్‌లో సురేశ్‌ రైనా దారిలోనే మరికొందరు క్రికెటర్లు పయనించే అవకాశం మెండు' అని ప్యాడీ అప్టన్‌ అన్నాడు.

మలింగ అవుట్‌...

శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌, యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2009 నుంచి ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లసిత్‌ మలింగ ఆ జట్టు విజయాల్లో కీలక భూమిక వహించాడు. 

2013, 2015, 2019 సీజన్లలో అంతిమ పోరులో (మూడుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్‌ రన్నరప్‌) లసిత్‌ మలింగ మ్యాజిక్‌తో ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌ టైటిళ్లు సొంతం చేసుకుంది. 2019 హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్లో షార్దుల్‌ ఠాకూర్‌ను బోల్తా కొట్టించి మలింగ ఒక్క పరుగు తేడాతో ట్రోఫీని ముంబయి గూటికి చేర్చాడు. 

మలింగ తండ్రి ఆరోగ్యం కొంతకాలంగా బాగోలేదు. త్వరలోనే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో కుటుంబంతో పాటు ఉండేందుకు మలింగ మొగ్గుచూపుతున్నాడు. మలింగ నిర్ణయాన్ని ముంబయి ఇండియన్స్‌ ప్రాంఛైజీ గౌరవించింది. మలింగ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్‌ పాటిన్సన్‌ను ఎంపిక చేసుకుంది. పరిస్థితులు అనుకూలిస్తే సీజన్‌ ఆఖర్లో లసిత్‌ మలింగ ముంబయి ఇండియన్స్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది.