బిసిసిఐ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భయపడినట్లే జరిగింది. ఐపిఎల్ కారణంగా టీమిండియా ప్రధాన ఆటగాళ్లు గాయాలపాలయ్యే అవకాశం వుందని....ఇది ప్రపంచ కప్ జట్టుపై ప్రభావం చూపిస్తుందని ముందునుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ సింగ్ బుమ్రా విషయంలో వీరు ఆందోళనపడగా కొందరు వారి మాటలను కొట్టిపారేశారు. అయితే ఆదివారం డిల్లీ-ముంబై మ్యాచ్ లో వీరి అనుమానమే నిజమయ్యింది. 

టీమిండియా పేసర్‌, డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ బుమ్రా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. డిల్లీ ఇన్నింగ్స్ చివరి బంతిని బ్యాట్ మెన్ రిషబ్ పంత్ బుమ్రా వైపు బలంగా బాదాడు. ఇలా వేగంగా వస్తున్న బంతిని ఆపే క్రమంలో బుమ్రా గాయపడ్డాడు. ఎడమ చేతికి గాయమవడంతో మైదానంలోనే నొప్పితో విలవిల్లాడిపోయాడు. అయితే అప్పటికే  ఇన్నింగ్స్ ముగియడంతో జట్టుతో పాటే బుమ్రా కూడా మైదానాన్ని వదిలాడు. 

ఆ తర్వాత 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు 19.2 ఓవర్లలో 176 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో చివరి బ్యాట్ మెన్ గా బరిలోకి దిగాల్సిన బుమ్రా బ్యాటింగ్ కు రాలేకపోయాడు. దీంతో అతన్ని ఆబ్‌సెంట్ హర్ట్ గా ప్రకటించడంతో డిల్లీ విజేతగా  నిలిచింది. 

అయితే మరో నాలుగు బంతులున్నప్పటికి బుమ్రా బ్యాటింగ్ కు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతడి గాయం తీవ్రత అధికంగా వుండటంవల్లే బ్యాటింగ్ కు రాలేకపోయాడని తెలుస్తోంది. దీంతో టీమిండియా అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. 

మొదటినుండి అనుకున్నట్లే ప్రపంచ కప్ మెగా టోర్నీపై ఐపిఎల్ ప్రభావం వుంటుందన్న ఆందోళనను ఈ  ఘటన నిజం చేసింది. వరల్డ్ కప్ లో టీమిండియా జట్టులో కీలక బౌలర్ వ్యవహరిస్తాడని  అనుకుంటున్న బుమ్రా ఇలా గాయానికి గురవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు మేనేజ్ మెంట్ మాత్రం బుమ్రాకు అయిన గాయం చేన్నదేనని...తర్వాతి మ్యాచ్ కు అతడు అందుబాటులోకి వస్తాడని ప్రకటించింది. ఏదేమైనా ఈ  ఐపిఎల్ వల్ల టీమిండియా కీలక ఆటగాళ్లు గాయాలపాలవుతారన్న వాదన  ఐపిఎల్ ఆరంభంలోనే నిజమని తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.