Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ - అక్టోబర్ లో ఐపీఎల్, ప్రేక్షకులకు నో ఎంట్రీ!

గంగూలీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు లేఖ మొదలు ఇక క్రికెట్ వర్గాలు మొత్తం ఐపీఎల్ నిర్వహణ గురించిన చర్చే సాగుతోంది. ఈ చర్చ సాగుతుండగానే.... ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ సిద్ధంగా ఉందని గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ పేర్కొన్నారు.

IPL To Be Held In September- October Season, No Entry For Spectators
Author
Mumbai, First Published Jun 12, 2020, 7:27 AM IST

టి20 ప్రపంచ కప్ గురించి గత కొన్ని రోజులుగా నేటి సాయంత్రమే నిర్ణయం, రేపు ప్రకటన చేస్తారు అని అనేక ఊహాగానాలు వినిపించినప్పటికీ.... ఐసీసీ మాత్రం ఎటువంటి ప్రకటన కూడా చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 పట్టాలెక్కటంపై క్రికెట్‌ ప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది. 

టెలీ కాన్ఫరెన్స్‌లో సమావేశమైన ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ టీ20 వరల్డ్‌కప్‌పై ఎటూ తేల్చకుండానే బుధవారం భేటిని ముగించింది. వరల్డ్‌కప్‌ నిర్వహణపై నిర్ణయాన్ని మరో నెల రోజుల పాటు వాయిదా వేసినట్టు వార్తలొచ్చినా, ఐసీసీ నుంచి అధికారిక సమాచారం మాత్రం లేదు. 

బుధవారం నాటి సమావేశం ముగిసిన అనంతరం, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు, అనుబంధ సంఘాలకు లేఖ రాయటం చర్చనీయాంశం. ఈ ఏడాది ఐపీఎల్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందుబాటులోని అన్ని అవకాశాలను బోర్డు పరిశీలిస్తోందని గంగూలీ లేఖలో పేర్కొన్నారు. ' ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణకు అన్ని అవకాశాలను బీసీసీఐ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఖాళీ స్టేడియంలో ఐపీఎల్‌ నిర్వహణకు సైతం బోర్డు సిద్ధంగా ఉంది. అభిమానులు, ప్రాంఛైజీలు, క్రికెటర్లు, బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు, ఇతర భాగస్వాములు ఐపీఎల్‌ నిర్వహణపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్‌ సహా ఇతర దేశాల క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొనటంపై ఆసక్తిని వ్యక్తపరుస్తున్నారు. ఐపీఎల్‌2020పై బీసీసీఐ ఆశావహ దృక్పథంతో ఉంది. ఐపీఎల్‌ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం' అని రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖలో గంగూలీ పేర్కొన్నారు.

ఐపీఎల్ నిర్వహణకు మేము రెడీ.... 

గంగూలీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు లేఖ మొదలు ఇక క్రికెట్ వర్గాలు మొత్తం ఐపీఎల్ నిర్వహణ గురించిన చర్చే సాగుతోంది. ఈ చర్చ సాగుతుండగానే.... ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ సిద్ధంగా ఉందని గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ పేర్కొన్నారు.

'ఐపీఎల్‌ నిర్వహణకు మేం సిద్ధంగా ఉన్నాం. టీ20 వరల్డ్‌కప్‌ వాయిదాపై ఐసీసీ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఐపీఎల్‌ ప్రణాళిక ఆరంభం కానుంది. త్వరలోనే ఐసీసీ దీనిపై తేల్చుతుందని ఆశిస్తున్నాం. మావైపు నుంచి సెప్టెంబర్‌-అక్టోబర్‌లో ఐపీఎల్‌ నిర్వహణకు ప్రణాళిక రూపొందించాం. సెప్టెంబర్‌-అక్టోబర్‌ విండో ప్రస్తుతానికి తాత్కాలిక షెడ్యూలే. ఐసీసీ అధికారిక ప్రకటన అనంతరం తుది నిర్ణయం ఉంటుంది. ఆలోగా ప్రణాళికకు రంగం సిద్ధం చేసుకుంటున్నాం' అని బ్రిజేష్‌ పటేల్‌ అన్నారు.

ఐపీఎల్ నిర్వహణ ఖచ్చితంగా కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎల్ వేదిక ఎక్కడ అనే దానిపై చర్చ జోరందుకుంది. విదేశాల్లోనా ఇక్కడ అనే అంశం గురించి బీసీసీఐ ఒక నిర్ణయానికి రానుంది. ఎక్కడైనా ప్రేక్షకులకు ఎంట్రీ ఉండదు కాబట్టి ఎక్కడ తేలికగా ఉంటె అక్కడ నిర్వహించేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios