Jeff Bezos vs Mukesh Ambani: గతేడాది రెండు కొత్త జట్ల బిడ్ ల ద్వారా భారీగా ఆదాయం ఆర్జించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. తాజాగా జారీ చేసిన ఐపీఎల్ మీడియా హక్కుల ప్రక్రియ ద్వారా కూడా భారీగా ఆశిస్తున్నది. అయితే ఈ వ్యవహారం ఇద్దరు వ్యాపార దిగ్గజాల మధ్య పోరుకు తెరలేపినట్టైంది.
భారత వ్యాపార విపణిలో వినిపించే ప్రముఖ పేరు ముఖేశ్ అంబానీ. సొంత వ్యాపార వ్యూహాలు, ప్రభుత్వ అండదండలతో వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆయన ఇక్కడ మకుటం లేని మహారాజు. అయితే ఆసియాలో కుబేరుడైన అంబానీ.. గత కొద్దికాలంగా ప్రపంచ అపర కుబేరుడు జెఫ్ బెజోస్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే రిటైల్ రంగంలో పోటా పోటీ గా ఒప్పందాలు కుదుర్చుకుని భారత మార్కెట్ పై ఆధిపత్యం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన గొడవలు కూడా ఇంకా సద్దుమణగకముందే ఈ ఇద్దరూ మళ్లీ మరో భారీ డీల్ లో ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఈసారి వీళ్లిద్దరికీ వైరం సృష్టించింది బీసీసీఐ.
ఐపీఎల్ మీడియా హక్కులకై ఈ ఇద్దరూ దిగ్గజాలు తమకు తోచినంత ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీసీఐకి బంగారు బాతులా దొరికిన ఐపీఎల్ లో ప్రసార హక్కులంటే మాములు విషయం కాదు. యేటికేడు టీఆర్పీల విషయంలో కొత్త రికార్డులు బ్రేక్ చేస్తున్న వీటిని దక్కించుకోవడానికి ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలు (అమెజాన్ వర్సెస్ రిలయన్స్) నువ్వా..? నేనా..? అని తలపడబోతున్నారు.
అమీ తుమీ కి సిద్ధం..
బీసీసీఐ ఇటీవలే ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల (2023-2027 కాలానికి)కు సంబంధించి ఆన్ లైన్ టెండర్లను విడుదల చేసింది. జూన్ 12, 13 న వేలం జరుగనుంది. గతంలో డిస్నీ స్టార్ తో పోటీ పడి ఓడిన అమెజాన్.. ఈసారి ఎలాగైనా వాటిని దక్కించుకోవాలని చూస్తున్నది. వేలంలో వాటిని ఎంత ధరైనా చెల్లించి దక్కించుకోవడానికి అమెజాన్ (అమెజాన్ ప్రైమ్) ప్రతినిధులు ఇప్పటికే ప్రయత్నాలు మమ్మురం చేశారు. అయితే బెజోస్ తో పాటు అంబానీకి చెందిన రిలయన్స్ (వయకామ్ 18) కూడా మీడియా హక్కుల విషయంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నది. వేలంలో ఎంతైనా ఖర్చు చేసి ప్రసార హక్కులను దక్కించుకునేందుకు రిలయన్స్ కూడా దూకుడుగానే ముందుకు సాగుతున్నది. ఇప్పుడు ఈ డీల్ ను దక్కించుకోవడం రెండు సంస్థలకు ప్రతిష్ట తో కూడిన వ్యవహరమైంది.
వేర్వేరుగా హక్కులు..
ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఈసారి మీడియా ప్రసారాలకు సంబంధించి టెలివిజన్, డిజిటల్ హక్కులుగా విభజించారు. అమెజాన్ కు ప్రైమ్ తో పాటు రిలయన్స్ కు వయాకామ్ ద్వారా డిజిటల్ ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. ఈసారి వేలంలో గరిష్టంగా రూ. 50వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే గతంలో రూ. 16,347.5 కోట్లు ఉన్న కనీస ధరను ఇప్పుడు రూ. 33వేల కోట్లకు పెంచింది.
ఇక ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయం అంతా ఇంతా కాదు. సౌదీ అరేబియాకు చెందని ప్రముఖ ఆయిల్ సంస్థ ఆరామ్కో సైతం ఐపీఎల్ తో ఒప్పందం (ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ స్పాన్సర్) కుదుర్చుకుందంటే ఈ క్యాష్ రిచ్ లీగ్ విస్తృతి అర్థం చేసుకోవచ్చు.
అవి కూడా...
రిలయన్స్, అమెజాన్ లతో పాటు ఇటీవలే కలిసిపోయిన సోని పిక్చర్స్ - జీ నెట్వర్క్ ఎంటర్ ప్రైజెస్ లు కూడా ఐపీఎల్ మీడియా హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. మరి ఈ దిగ్గజాలలో ప్రసారం హక్కులు దక్కించుకునేదెవరు..? అనేది తెలియాలంటే జూన్ 12 దాకా ఆగాల్సిందే.
