ఐపీఎల్ వాయిదా వేసిన తేదికి స్టార్ట్ అవదు. మరి ఎప్పుడు అంటే సమాధానం ఆ భగవంతుడికే తెలియాలి. ప్రపంచమంతా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నవేళ ఐపీఎల్ సహా అన్ని స్పోర్టింగ్ ఈవెంట్లు వాయిదా పడడమోలేదా రద్దవడమో జరిగాయి. 

అయినా నాలుగు సంవత్సరాలకు ఒక్కాసారి జరిగే విశ్వ క్రీడలే సంవత్సరం పాటు వాయిదా పడ్డాయి. దాని ముందు ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ ఏపాటిది చెప్పండి? చూడబోతుంటే... ఐపీఎల్ ఈ సంవత్సరం లేనట్టే కనిపిస్తుంది. గంగూలీ కూడా మొన్న చూచాయిగా ఇదే మాట అన్నాడు. 

ఈ నేపథ్యంలో ఐపీఎల్ అంటేనే మనకు గుర్తొచ్చేది భారీ బిడ్డింగ్. కోట్లు వెచ్చించి క్రీడాకారులను కొంటాయి ఫ్రాంచైజీలు. ఇప్పుడు గనుక ఐపీఎల్ జరగకపోతే... మరి క్రీడాకారుల కాంట్రాక్టులు ఏమవుతాయి? వారికి ఒప్పందం ప్రకారం ఇవ్వవలిసిన డబ్బు  చెల్లించాలా? ఇవి ఇప్పుడు అందరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్నలు. 

Also Read లాక్ డౌన్.. బులెట్ కాఫీతో గుమగుమలాడిస్తున్న జాంటీ రోడ్స్...

దీనికి ఫ్రాంచైజీలు బీసీసీఐ నిబంధనలే మనిబంధనలు అంటున్నాయి. ఇంతకు ఆ బీసీసీఐ నిబంధన ఏమిటి? ఫ్రాంచైజీలు ఏమి చెబుతున్నాయి ఒకసారి తెలుసుకుందాం. 

నో ప్లే, నో మనీ. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు ప్రస్తుతం ఇదే మాట చెబుతున్నాయి. బీసీసీఐ నిబంధనలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ప్రాంఛైజీలు అంటున్నాయి. ఐపీఎల్‌ 13 వాయిదాతో ఆటగాళ్ల కాంట్రాక్టు డబ్బు విషయంలో ఫ్రాంచైజీలు గట్టిగా డిసైడ్ అయిపోయాయి. 

మ్యాచ్ ఆడితేనే డబ్బులు. లేదంటే లేదు. ఇది ఇప్పుడు ఫ్రాంచైజీలు చెబుతున్న మాట.  బీసీసీఐ నిబంధనల ప్రకారం టోర్నీ ఆరంభానికి ముందు 15 శాతం, లీగ్‌ మధ్యలో 65 శాతం,  మిగతా 20 శాతం డబ్బులను లీగ్‌ ముగిసిన అనంతరం ఆటగాళ్లకు చెల్లించాల్సి ఉంటుంది. 

ఐపీఎల్ ఇంకా ఆరంభం అవలేదు కాబట్టి, ఏ ఆటగాడికి కూడా కాంట్రాక్టు డబ్బులను ప్రాంఛైజీలు చెల్లించలేదు. ఐపీఎల్‌ ఆగిపోతే బీసీసీఐకి వార్షికంగా రూ. 3000 కోట్ల నష్టం వాటిల్లనుంది. 

క్రికెట్‌ ఆడితేనే బీసీసీఐకు ఆదాయం లభిస్తుంది. మ్యాచులు లేకుంటే ఆదాయం పూర్తిగా ఆగిపోతుంది. అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశవాళీ ప్లేయర్లపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. 

ఈ సీజన్‌లో ఐపీఎల్‌ కాంట్రాక్టులు దక్కించుకుని, జీవితం మలుపు తిరిగిందని అనుకుంటున్న వర్థమాన క్రికెటర్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక్కో ప్రాంఛైజీ ఆటగాళ్లకు రూ. 75-85 కోట్లు చెల్లించాల్సి ఉంది. లీగ్‌ జరుగకుండా ఈ సొమ్మును ఫ్రాంచైజీలు ఇవ్వవు. ఇప్పటికే ఫుట్ బాల్ లీగుల్లో వేతన కొత్త నడుస్తోంది. ఇక్కడ కూడా అదే బాట పట్టనున్నారు ఫ్రాంచైజీలు. నో వర్క్ నో ప్లే!