కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ పై పోరాడటానికి భార‌త ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటించింది. కేవలం భారత్ మాత్రమే కాదు.. పలు దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో.. కరోనా నేపథ్యంలో క్రికెటర్లు, సెలబ్రెటీలంతా స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు.

కాగా... లాక్ డౌన్ లో క్రికెటర్లంతా ఎవరికి తోచింది వారు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ.. భార్యతో కలిసి ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే... దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్  ఈ సమయాన్ని కుటుంబంతో గడపడానికి కేటాయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కిచెన్ లో ప్రయోగాలు కూడా చేస్తున్నాడు.

కిచెన్ లో స్వయంగా తన చేతులతో బులెట్ కాఫీ తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోని ట్విట్టర్లో షేర్ చేశాడు. వాటిని క్యాప్షన్ గా.. స్టే హెల్దీ హోమ్, లాక్ డౌన్, స్టే హోమ్ లను హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాడు. కాగా... ఈ వీడియో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

కొద్ది రోజుల క్రితం కూడా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.  పవిత్ర గంగా నదిలో స్నానమాచరిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో ఉంచాడు. ట్విట్టర్ వేదికగా తాను గంగ నదిలో మునకవేస్తున్న ఫోటోను పెట్టి.... చల్లటి గంగా నీటిలో ఇలా మునక వేయడం ఇటు ఆధ్యాత్మికంగా శారీరకంగా రెండు రకాలుగా మంచిదని అన్నాడు. 

కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నెల మొదటి వారంలోనే భారత్ కి చేరుకున్నాడు.  ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు జాంటీ రోడ్స్.

గతంలో ముంబై ఇండియన్స్ కి ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించిన ఈ దిగ్గజ క్రికెటర్ ప్రస్తుతానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి తన సేవలను అందిస్తున్నాడు. సాధారణంగా భారత దేశంతో జాంటీ రోడ్స్ కి అవినాభావ సంబంధముంది. 

భారతీయతను అమితంగా ఇష్టపడే రోడ్స్... తన కూతురికి కూడా ఇండియా అని పేరు పెట్టుకున్నాడు. భారతదేశం ఆధ్యాత్మికతతో అలరారుతుందని, అందుకే తన కూతురికి అలా ఇండియా అని పేరు పెట్టుకున్నట్టు తెలిపాడు.

గంగలో స్నానమాచరిస్తున్న ఫోటోను రోడ్స్ పెట్టగానే హర్భజన్ సింగ్ వెంటనే స్పందించాడు. ఇండియా ను భారతీయుడినైన తనకన్నా కూడా రోడ్స్ ఎక్కువగా చూశాడని, నెక్స్ట్ టైం తనను కూడా తీసుకెళ్లాలని అన్నాడు.