హైదరాబాద్: ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల కోసం క్రికెట్ అభిమానులు తెగ ఎదురు చూశారు. ప్లే ఆఫ్ మ్యాచుల టికెట్లను అందుబాటులో పెట్టిన ఐపిఎల్ నిర్వాహకులు ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై మౌనం వహించారు. ముందస్తు ప్రకటనలు లేకుండా అమ్మకాలు చేసి కేవలం రెండు నిమిషాల్లో టికెట్లను అన్నింటినీ అమ్మేసింది. 

మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈవెంట్స్ డాట్ కామ్ సంస్థ ఆన్ లైన్లో టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది. ఒక రోజు ముందో, కొన్ని గంటల ముందో ప్రకటనలు ఇవ్వలేదు. టీవీ చానెళ్లకు సమాచారం ఇవ్వలేదు. గుట్టు చప్పుడు కాకుండా టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది. టికెట్లు అన్నీ అమ్ముడైపోయినట్లు నిమిషాల వ్యవధిలోనే ఆ వెబ్ సైట్ చూపించింది. 

కేవలం రూ.1500, రూ.2000, రూ.2500, రూ. 5000 టికెట్లను మాత్రమే అందుబాటులో పెట్టింది. మిగతా టికెట్ల గురించి అసలు ప్రస్తావించలేదు. వాటి గురించి మాట్లాడడానికి ఈవెంట్స్ ప్రతినిధి సుధీర్ గానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిఈవో పాండురంగ మూర్తి గానీ అందుబాటులో లేరు. 

కొన్ని నిమిషాల వ్యవధిలోనే 38 వేల టికెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉందని, నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డు లేకుండా టీకెట్లు తీసుకోవడానికి వీలు కాదని అంటున్నారు.