Asianet News TeluguAsianet News Telugu

IPL Final CSK vs KKR: కేకేఆర్‌కి ఊహించని షాక్... కట్టు తప్పిన దినేశ్ కార్తీక్‌కు జరిమానా...

IPL Final CSK vs KKR: ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనను అతిక్రమించిన కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌... మ్యాచ్ రిఫరీ ముందు తప్పును అంగీకరించిన డీకే...

IPL Final CSK vs KKR:  Dinesh Karthik has been fined for breaching Code Of Conduct
Author
India, First Published Oct 14, 2021, 9:56 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ సెకండాఫ్‌లో ఊహించని కమ్‌బ్యాక్ విజయాలతో ఫైనల్‌లోకి దూసుకెళ్లింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఈ విజయాల్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ పాత్ర కూడా ఉంది. వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి వంటి భారత బౌలర్లకు వికెట్ల వెనకాల నుంచి ఎలా బౌలింగ్ వేయాలో చెబుతూ, వారి సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న దినేశ్ కార్తీక్, బ్యాటింగ్‌లోనూ కొన్ని మెరుపులతో జట్టుకి విజయాలను అందించాడు...

ఉత్కంఠభరితంగా సాగిన రెండో క్వాలిఫైయర్‌లో ఆఖరి ఓవర్‌లో విజయాన్ని అందుకున్న కేకేఆర్‌కి ఊహించని షాక్ తగిలింది.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనను అతిక్రమించినందుకు కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి భారీ జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం. 

అసలేం జరిగిందంటే 19వ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన దినేశ్ కార్తీక్ 3 బంతులాడి పరుగులేమీ చేయకుండానే కగిసో రబాడా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కార్తీక్, కోపంతో స్టంప్స్‌ను కొట్టి పెవిలియన్‌కి వెళ్లాడు... ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ, జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు....

‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అఫెన్స్ 2.2 రూల్ ప్రకారం కార్తీక్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. లెవెల్ 1 నియమాన్ని అతిక్రమించిందుకు మ్యాచ్ రిఫరీ విధించే శిక్షకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది...’ అంటూ ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది...

దినేశ్ కార్తీక్, తన తప్పును అంగీకరించడంతో, మ్యాచ్ రిఫరీ నిర్ణయంపై అతనికి విధించే జరిమానా లేక శిక్ష ఆధారపడి ఉంది. కార్తీక్ తప్పును రిఫరీ సీరియస్‌గా తీసుకుంటే, ఫైనల్ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే ప్రమాదం కూడా ఉంది...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో 136 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఒకనొకదశలో 96/0 పరుగులతో ఉండి, ఈజీగా గెలుస్తుందని అనిపించింది. అయితే వెంకటేశ్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది కేకేఆర్...

24 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో 22 బంతుల్లో 7 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది... శుబ్‌మన్ గిల్ అవుటైన తర్వాత దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, షకీబుల్ హసన్, సునీల్ నరైన్ డకౌట్ అయ్యారు... అయితే 20వ ఓవర్ ఐదో బంతికి సిక్సర్ కొట్టిన రాహుల్ త్రిపాఠి, కేకేఆర్‌కి విజయాన్ని అందించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios