సూర్యకుమార్ యాదవ్ కోసం కేకేఆర్ మాస్టర్ ప్లాన్.. ముంబై ఏం చేస్తుందో మరి..?
IPL 2025: ఐపీఎల్ లో ప్రస్తుతం భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాడు. ప్రస్తుతం అతను భారత టీ20 జట్టుకు కూడా కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో సూర్య ఐపీఎల్ ప్రయాణం గురించి హాట్ టాపిక్ నడుస్తోంది.
IPL 2025 : సూర్య కుమార్ యాదవ్.. భారత క్రికెట్ లో స్టార్ ప్లేయర్. టీ20 క్రికెట్ రారాజు. ప్రస్తుతం టీ20 నెంబర్ వన్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. బౌలర్లకు గ్రౌండ్ లో పట్టపగలే చుక్కలు చూపించే ఈ స్టార్ క్రికెటర్ గురించి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (ఐపీఎల్ 2025) కి ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే, రాబోయే సీజన్ లో అతను ముంబైని వీడి మరో టీమ్ లో చేరనున్నాడని సమాచారం. దీని కోసం ఐపీఎల్ 2024 ఛాంపియన్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
శ్రేయాస్ అయ్యర్ సంగతేంటి?
ఐపీఎల్ 2024లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఛాంపియన్ జట్టు రాబోయే సీజన్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను మరో ప్లేయర్ తో భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కొత్త కెప్టెన్‌ని నియమిస్తారు. జట్టు దానిని త్వరలోనే ప్రకటించనుంది. కేకేఆర్ ఇప్పటికే ఈ విషయంలో సూర్యకుమార్ యాదవ్‌ను సంప్రదించి అతనికి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్టు కూడా పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఇంతకుముందు కేకేఆర్ జట్టులో ఉన్న సూర్య..
కొన్నాళ్లుగా సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టులో ఉన్నాడు. కానీ, దానికంటే ముందు అతను కేకేఆర్ జట్టులో కూడా ఉన్నాడు. అప్పుడు పెద్ద ప్లేయర్ కాదు.. కానీ, ఇప్పుడు టీ20లో టాప్ బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ ఒకరు. ప్రస్తుతం తన అద్భుతమైన ఆటతో బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ కు భారత టీ20 జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. సూర్య కెప్టెన్సీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి శ్రీలంకలో టీ20 సిరీస్ ను గెలుచుకుంది.
ఐపీఎల్ రూల్ మార్పులతోనే..
ఐపీఎల్ 2025కి ముందు జరిగే మెగా వేలంలో ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి ఇప్పుడు జట్లను బీసీసీఐ అనుమతించవచ్చని సమాచారం. కానీ, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదివరకటి రూల్ ప్రకారం జట్లు కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశముంది. ఈ రెండు పరిస్థితుల్లో కూడా ముంబై జట్టు సూర్యకుమార్ యాదవ్ ను వదులుకునే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. సూర్య కోసం కేకేఆర్ ముంబై నుంచి వాణిజ్యం చేయవచ్చు. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ నిర్ణయాలతో సూర్యకుమార్ యాదవ్ సంతృప్తి చెందలేదనీ, అలాగే, ముంబై జట్టు కూడా అతన్ని విడుదల చేయవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఛాంపియన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ని కేకేఆర్ కెప్టెన్సీ నుంచి పక్కనపెడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
పాకిస్తాన్ కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్