IPL 2024 : ఐపీఎల్ వేలానికి ముందు కీలక నిర్ణయం.. మనీష్ పాండే, సర్ఫరాజ్‌లను రిలీజ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2024కు సంబంధించి డిసెంబర్ 19న దుబాయ్‌లో మెగా వేలం పాట జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) సర్పరాజ్ ఖాన్, మనీస్ పాండేలను వేలం పాట నిమిత్తం రిలీజ్ చేసింది.
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2024కు సంబంధించి డిసెంబర్ 19న దుబాయ్‌లో మెగా వేలం పాట జరగనుంది. ఇందుకు కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. ఈ బిగ్ డే కు ముందు మొత్తం పది ఫ్రాంఛైజీలు తమ జాబితాను విడుదల చేయడానికి నవంబర్ 26 వరకు గడువు ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. కొన్ని టీమ్‌లు ఆటగాళ్లను నిలబెట్టుకోగా.. కొందరు క్రికెటర్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) సర్పరాజ్ ఖాన్, మనీస్ పాండేలను వేలం పాట నిమిత్తం రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌లలో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో (చివరి నుంచి 2వ స్థానం)లో నిలిచింది.
దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు వున్నప్పటికీ సర్పరాజ్ ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేయలేకపోయాడు. 26 ఏళ్ల సర్పరాజ్ నాలుగు మ్యాచ్‌ల్లో 13.25 సగటుతో కేవలం 53 పరుగులు చేశాడు. అతని ఐపీఎల్ కెరీర్‌లో ఆడిన 50 మ్యాచ్‌లలో 22.50 సగటుతో 585 పరుగులు చేయగా.. స్ట్రైక్ రేట్ 130.58.
ఇక మనీష్ పాండే విషయానికి వస్తే.. పది మ్యాచ్‌ల్లో 17.78 సగటుతో 160 పరుగులు చేశాడు. అంతేకాదు.. ఐపీఎల్ హిస్టరీలో సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 170 మ్యాచ్‌లు ఆడిన మనీష్ పాండే 29.07 సగటుతో 3,808 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు కూడా వున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి కొత్తగా ప్రతిభావంతులైన ఆటగాళ్లను కొనుగోలు చేయాలని చూస్తోంది. వచ్చే సీజన్‌లో డీసీ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి జట్టును చేరనుండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ బలంగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డీసీ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ.. వచ్చే సీజన్‌లో పంత్ అందుబాటులో వుంటారని ధృవీకరించారు. 26 ఏళ్ల రిషబ్ పంత్ ఇటీవలే కోల్‌కతాలోని ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణా శిబిరలో చేరాడు. కానీ తదుపరి సీజన్‌కు ముందస్తు సన్నాహాల్లో తన సహచరులతో కలిసి శిక్షణ పొందలేదు. గతేడాది డిసెంబర్ 30న రిషబ్ పంత్ ఓ భయంకరమైన కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే.