IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ తో గువహతి వేదికగా జరుగుతున్న  మ్యాచ్ లో  రాజస్తాన్ రాయల్స్  ఓపెనర్లు కదం తొక్కారు.  యువ ఆటగాడు జైస్వాల్, విధ్వంసకర ఓపెనర్ బట్లర్ లు  ఢిల్లీ బౌలర్లను  వీర బాదుడు బాదారు.  

గువహితి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. బర్సపర స్టేడియంలో బౌండరీల మోత మోగించారు. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఉతికారేసినట్టుగానే.. ఢిల్లీ బౌలింగ్‌నూ యశస్వి జైస్వాల్ (31 బంతుల్లో 60, 11 ఫోర్లు, 1 సిక్సర్), జోస్ బట్లర్ (51 బంతుల్లో 79, 11 ఫోర్లు, 1 సిక్సర్) లు ఆటాడుకున్నారు. ఫస్ట్ వికెట్ కు 50 బంతుల్లోనే 98 పరుగులు జోడించి రాజస్తాన్ భారీ స్కోరు చేసేందుకు బాటలు పరిచారు. వీరికి తోడు చివర్లో షిమ్రన్ హెట్మెయర్ (21 బంతుల్లో 39 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్సర్లు) కూడా రెచ్చిపోయి ఆడటంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మరి ఈ టార్గెట్ ను ఢిల్లీ బ్యాటర్లు ఛేదించి ఐపీఎల్-16లో బోణీ కొడతారా..?

జైస్వాల్ సూపర్.. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్‌కు ఓపెనర్లు అదిరపోయే ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ తొలి 8.3 ఓవర్లలోనే 98 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. జైస్వాల్, బట్లర్ లు ఢిల్లీ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని వీరబాదుడు బాదారు. ఖలీల్ అహ్మద్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ ఐదు బౌండరీలు బాదాడు. ఐపీఎల్-16లో ఇదే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫస్ట్ ఓవర్. 

రెండో ఓవర్లో దంచడం బట్లర్ వంతు. నోర్జే వేసిన రెండో ఓవర్లో బట్లర్ మూడు బౌండరీలు బాదాడు. రెండు ఓవర్లలోనే ఆ జట్టు 32 పరుగులు చేయగా అవన్నీ బౌండరీల ద్వారానే వచ్చినవి కావడం గమనార్హం. ముఖేశ్ కుమార్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి జైస్వాల్ తీసిన పరుగే రాజస్తాన్ కు తొలి సింగిల్. 4 ఓవర్లలోనే రాజస్తాన్ స్కోరు 50 పరుగులు దాటింది. అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్లో జైస్వాల్ మూడు బౌండరీలు బాదాడు. అతడే వేసిన ఏడో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టి 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

బ్రేక్ ఇచ్చి ముఖేశ్.. 

హాఫ్ సెంచరీ తర్వాత కుల్దీప్ యాదవ్ వేసిన 8వ ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు జైస్వాల్. ఇదే ఓవర్లో బట్లర్ రెండు ఫోర్లు కొట్టాడు. కానీ ముఖేశ్ కుమార్ వేసిన 9వ ఓవర్ మూడో బంతికి జైస్వాల్.. అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడి స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ (0) కూడా నిరాశపరిచాడు. అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్లో రెండో బంతికి భారీ సిక్సర్ బాదిన బట్లర్.. 25 బంతుల్లో ఈ సీజన్ లో రెండో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ శాంసన్ ప్లేస్ లో వచ్చిన లోకల్ బాయ్ రియాన్ పరాగ్ (7) మాత్రం రొవ్మన్ పావెల్ వేసిన 14వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

హెట్మెయర్ బాదుడు.. 

వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయినా రాజస్తాన్ బట్లర్ క్రీజులో ఉండటంతో ధీమాగా ఉంది. ముఖేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో బట్లర్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టాడు. నోర్జే బౌలింగ్ లో కూడా ఇదే రిపీట్ అయింది. ముఖేష్ కుమార్ వేసిన 19వ ఓవర్లో హెట్మెయర్ సిక్సర్ బాదగా మూడో బంతికి బట్లర్ ఔట్ అయ్యాడు. బట్లర్ స్థానంలో వస్తూనే భారీ సిక్సర్ బాదాడు ధ్రువ్ జురెల్ (8 నాటౌట్). నోర్జే వేసిన ఆఖరి ఓవర్లో హెట్మెయర్ రెండు భారీ సిక్సర్లు బాది ఢిల్లీ లక్ష్యాన్ని 200గా నిలిపాడు.