ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మను కలిసి , పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న విరాట్ కోహ్లీ... వీడియో పోస్ట్ చేసిన ఐపీఎల్..
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆటతో కంటే యాటిట్యూడ్‌తోనే వార్తల్లో నిలుస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీతో చేతులు కలపని కోహ్లీ, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రచ్చ రచ్చ చేశాడు...
నవీన్ వుల్ హక్‌ని సెడ్జ్ చేసి, అడ్డు చెప్పిన వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రాపై కూడా నోటి దురుసు చూపించిన విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్‌తో వాగ్వాదానికి దిగాడు. సీనియర్లంటే విరాట్ కోహ్లీకి ఏ మాత్రం గౌరవం లేదని, గ్రౌండ్‌లో అతని ప్రవర్తన చూసి కుర్రాళ్లు కూడా ఇలాగే తయారవుతారని చాలామంది మాజీలు కామెంట్లు చేశారు..
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మను కలిసిన విరాట్ కోహ్లీ, ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక ఖాతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది...
‘విరాట్ కోహ్లీ తన చిన్న నాటి కోచ్‌ని ఇలా కలిసి, అభివాదం చేశాడు..’ అంటూ కాప్షన్ జోడించింది ఐపీఎల్. ఈ వీడియోపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీకి పెద్దలంటే చాలా గౌరవం ఉందని, అయితే ఆ గౌరవం అవతలి వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు...
‘‘విరాట్ కోహ్లీ నా దగ్గరికి కోచింగ్‌కి వచ్చినప్పడు నేను అతన్ని అండర్11 టీమ్‌లో పెట్టాను. అయితే అతను ఆ టీమ్‌లో ఆడడానికి ఇష్టపడలేదు. జూనియర్స్‌తో ఆడేటప్పుడు అతను ఎప్పుడూ అవుట్ అయ్యేవాడు కాదు..
కొన్నాళ్లకే నా దగ్గరికి వచ్చి, నేను నాకంటే పెద్ద వాళ్లతో ఆడాలనుకుంటున్నా అని చెప్పాడు. ‘నువ్వు చాలా చిన్నోడివి. వాళ్ల బౌలింగ్ స్పీడ్‌ని నువ్వు తట్టుకోలేవు. నీ వయసు పిల్లలతో కలిసి ఆడమని చెప్పేవాడిని. అయితే అతను వినేవాడు కాదు.. వాళ్లు ఎవ్వరూ నన్ను అవుట్ చేయలేకపోతున్నారు, బోర్ కొడుతోందని చెప్పేవాడు.. అలా నన్ను విసిగించి విసిగించి... సీనియర్లతో కలిసి ఆడేందుకు ఒప్పించాడు...’’ అంటూ విరాట్ కోహ్లీ చిన్ననాటి విషయాలను చెప్పుకొచ్చాడు రాజ్‌కుమార్ శర్మ..
విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌లో మూడేళ్ల పాటు పరుగులు చేయని సమయంలో కూడా అతనికి అండగా నిలిచాడు రాజ్‌కుమార్ శర్మ. విరాట్ ఫామ్‌లోకి వస్తాడని, తిరిగి పరుగుల వరద పారిస్తాడని నమ్ముతూ వచ్చాడు.. ఎట్టకేలకు ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేసి ఫామ్‌ని అందుకున్న విరాట్ కోహ్లీ... ఆరు నెలల గ్యాప్‌లో 5 సెంచరీలు బాదాడు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో 376 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 5లో ఉన్న విరాట్ కోహ్లీ, ఢిల్లీతో మ్యాచ్‌లో 7 వేల ఐపీఎల్ పరుగులను అందుకున్నాడు. ఐపీఎల్ 6 వేల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, 7 వేల క్లబ్‌లో చేరిన తొలి బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు..
