ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ... ఎప్పటిలాగే అట్టర్ ఫ్లాప్ అయిన ఆర్‌సీబీ మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు..
హోం గ్రౌండ్, బౌండరీల మోత మోగే చిన్నస్వామి స్టేడియం.. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీరు మారలేదు.. ఫాఫ్ డుప్లిసిస్ త్వరగా అవుట్ కావడం, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్ చేరడంతో వరుస వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ, 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించిన కెప్టెన్ ఫాఫ్ డు ప్లిసిస్, 16 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
ఫాఫ్ డుప్లిసిస్ అవుటైన తర్వాత ఆర్‌సీబీ స్కోరు వేగం తగ్గింది. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 50 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తి అయిన తర్వాత లలిత్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర యష్ ధుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ..
చిన్న స్వామి స్టేడియంలో 2500 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, ఒకే స్టేడియంలో అత్యధిక టీ20 హాఫ్ సెంచరీలు (22) చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మహిపాల్ లోమ్రోర్ 18 బంతుల్లో 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్‌కి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చి ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి పంపింది ఆర్‌సీబీ..
4 బంతుల్లో ఓ సిక్సర్ బాదిన హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అభిషేక్ పోరెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో 3 సిక్సర్లతో 24 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
ఆ తర్వాతి బంతికే దినేశ్ కార్తీక్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు కుల్దీప్ యాదవ్. వస్తూనే షాట్ ఆడిన కార్తీక్, లలిత్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకానొక దశలో 117/2 స్కోరుతో ఉన్న ఆర్‌సీబీ, 11 బంతుల గ్యాప్‌లో 4 వికెట్లు కోల్పోయి 132/6 స్థితికి చేరుకుంది.. 132 స్కోరు వద్దే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ, అవుటైన మహిపాల్ లోమ్రోర్ ప్లేస్‌లో అనుజ్ రావత్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కి పంపింది...
15వ ఓవర్‌లో 2 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, మెయిడిన్ ఓవర్ నమోదు చేశాడు. 16వ ఓవర్‌లో 5, 17వ ఓవర్‌లో 7 పరుగులే రాగా, 18వ ఓవర్‌లో 8 పరుగులే వచ్చాయి. ముస్తాఫిజుర్ రహ్మాన్ వేసిన 19వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన షాబజ్ అహ్మద్, 12 పరుగులు రాబట్టాడు.
7 బంతుల తర్వాత సింగిల్ తీసిన ఇంపాక్ట్ ప్లేయర్ అనుజ్ రావత్, 22 బంతులు ఆడినా 15 పరుగులే చేయగలిగాడు. షాబజ్ అహ్మద్ 12 బంతుల్లో 20 పరుగులు చేయడంతో ఆర్‌సీబీ ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. కీలకమైన చివరి 6 ఓవర్లలో ఆర్‌సీబీ బ్యాటర్లు 40 పరుగులు మాత్రమే రాబట్టగలిగారు..
