IPL 2023, SRH vs RCB: ఐపీఎల్  లో మరోసారి ఆర్సీబీని అదృష్ట దేవత  ముంబై ఇండియన్స్ రూపంలో హాయ్ చెప్పింది.   మరి దానిని  బెంగళూరు వినియోగించుకుంటుందా..? లేదా..? 

ఐపీఎల్ లో ఇంతవరకూ కప్ కొట్టని జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ తో కీలక పోరులో తలపడుతున్నది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ రూపంలో ఆ జట్టుకు అదృష్టం కలిసొచ్చింది. ఇటీవలే లక్నో జట్టు ముంబైని ఓడించడంతో ఆర్సీబీకి ముంబైని దాటేందుకు ఛాన్స్ వచ్చింది. నేడు సన్ రైజర్స్ తో మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీకి ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకుంటే అస్సామే గతి. ఈ నేపథ్యంలో ఉప్పల్ గ్రౌండ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేయనుంది. సన్ రైజర్స్ టాస్ ఓడి మొదలు బ్యాటింగ్ కు రానుంది.

ఆర్సీబీకి ఈ మ్యాచ్ ఎంతో కీలకం కాగా నేటి మ్యాచ్ లో ఆ జట్టుకు షాక్ ఇచ్చేందుకు సన్ రైజర్స్ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానానికి పడిపోయిన హైదాబాద్ ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆ అపప్రదను తొలగించుకోవచ్చు. అదీగాక ఐపీఎల్ - 16లో భాగంగా గత మూడు లీగ్ మ్యాచ్ లలో ఊహించని ఫలితాలొచ్చాయి. 

ముంబైని లక్నో ఓడించగా.. పంజాబ్ ను ఢిల్లీ మట్టికరిపించింది. ముంబైకి ప్లేఆఫ్స్ రేసులో మరో ఛాన్స్ ఉండగా పంజాబ్ కు అయితే ఆ అవకాశం కూడా లేదు. నేడు సన్ రైజర్స్ కూడా బెంగళూరుకు షాకిస్తే లక్నో, చెన్నై ప్లేఆఫ్స్ బెర్త్ లు ఖాయం అవుతాయి. ముంబై కూడా ఆ రేసులో మరింత ధీమాగా ఉండే ఛాన్స్ ఉంటుంది. 

పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ముంబై ఇండియన్స్.. 13 మ్యాచ్ లు ఆడి ఏడింటిలో గెలిచి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు మరో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. మరోవైపు ఆర్సీబీ.. 12 మ్యాచ్ లలో ఆరింట గెలిచి 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఆ జట్టుకు మరో రెండు మ్యాచ్ లు ఉన్నాయి. నేటి మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ ముంబైకి గట్టి పోటీ ఇవ్వొచ్చు. పంజాబ్, రాజస్తాన్ కు ఆ ఛాన్స్ లేకున్నా ఆర్సీబీకి పుష్కలంగా అవకాశాలున్నాయి. 

ఐపీఎల్ లో సన్ రైజర్స్, ఆర్సీబీలు 21 సార్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ కే మొగ్గు ఉంది. సన్ రైజర్స్ 12 మ్యాచ్ లలో గెలవగా ఆర్సీబీ 9 మ్యాచ్ లలో గెలుపొందింది. అదీగాక హైదరాబాద్ లో ఆర్సీబీ ఆడిన గత ఏడు మ్యాచ్ లలో బెంగళూరు గెలిచింది ఒక్క మ్యాచ్ మాత్రమే. మరి గత మ్యాచ్ ల ఫలితాలే పునరావృతమైతే మాత్రం బెంగళూరుకు బెంగ తప్పదు. 

తుది జట్లు : 

సన్ రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ దగర్, భువనేశ్వర్ కుమార్, నితీశ్ రెడ్డి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్) , గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్, అనూజ్ రావత్, షాబాజ్ అహ్మద్, మైఖేల్ బ్రాస్‌వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్