IPL 2023: ఆడిన రెండు మ్యాచ్ లలో రెండు ఓటములతో ఉన్న  సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకవైపు.. అదే విధంగా రెండు మ్యాచ్ లలోనూ గెలిచి  ఊపు మీదున్న పంజాబ్ మరోవైపు.. ఈ రెండు జట్ల మధ్య  ఉప్పల్ వేదికగా  మ్యాచ్ జరుగుతున్నది. 

ఐపీఎల్-16లో కొత్త కెప్టెన్, పలువురు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగి వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. నేడు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో ఢీకొననుంది. ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ లలోనూ సన్ రైజర్స్ ఓడి డీలా పడింది. మరోవైపు పంజాబ్ మాత్రం రెండు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో జోష్ లో ఉంది. మరి నేటి మ్యాచ్ లో పంజాబ్ ను హైదరాబాద్ నిలువరించి తొలి విజయాన్ని అందుకునేనా..? ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ కు రానుంది. పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది. 

గత రెండు మ్యాచ్ లలో బ్యాటింగ్ వైఫల్యంతో దారుణమైన ఓటములు ఎదుర్కున్న హైదరాబాద్.. నేటి మ్యాచ్ లో దాన్నుంచి బయటపడాలని భావిస్తున్నది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, రూ. 13 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ లతో పాటు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలు జూలు విదిలిస్తేనే హైదరాబాద్ భారీ స్కోరు చేయగలుగుతుంది.

బౌలింగ్ లో భువనేశ్వర్ తో పాటు ఉమ్రాన్ మాలిక్, ఫరూఖీ లు భారీగా పరుగులిస్తున్నారు. స్పిన్నర్ అదిల్ రషీద్ కూడా ఏమంత ప్రభావం చూపడంలేదు. మరి నేటి మ్యాచ్ లో అయినా ఆరెంజ్ ఆర్మీ రాణిస్తుందేమో చూడాలి.

మరోవైపు పంజాబ్ బలంగా ఉంది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, జితేశ్ శర్మ, భానుక రాజపక్సలు మంచి టచ్ లో ఉన్నారు. బౌలింగ్ లో నాథన్ ఎల్లీస్ గత రెండు మ్యాచ్ లలోనూ రాణించాడు. సామ్ కరన్ కూడా మెరుగైన ప్రదర్శనలే చేస్తున్నాడు. 

ఐపీఎల్ లో సన్ రైజర్స్ - పంజాబ్ లు 20 సార్లు తలపడగా ఎస్ఆర్‌హెచ్ 13 మ్యాచ్ లు గెలవగా పంజాబ్ 7 మ్యాచ్ లను నెగ్గింది. 

Scroll to load tweet…

తుది జట్లు : 

సన్ రైజర్స్ : మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండె, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్

పంజాబ్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, మాథ్యూ షార్ట్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కరన్, నాథన్ ఎలీస్, మోహిత్ రథి, హర్‌ప్రీత్ బ్రర్, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్