IPL 2023: 5 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు చేయలేకపోయిన ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు... ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం..
ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌లో ఓడింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో పోరాడి ఓడిన సన్‌రైజర్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కోల్‌కత్తాలో ఆరెంజ్ ఆర్మీ చేతుల్లో ఓడిన కేకేఆర్, హైదరాబాద్‌లో ప్రతీకారం తీర్చుకుంది.
172 పరుగుల లక్ష్యఛేదనలో మరోసారి మయాంక్ అగర్వాల్ డిస్సప్పాయింట్ చేశాడు. 11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, హర్షిత్ రాణా బౌలింగ్‌లో గుర్భాజ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
9 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, రస్సెల్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి వైభవ్ అరోరాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 4 బంతులు ఆడిన హారీ బ్రూక్, అనుకూల్ రాయ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు... అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న కేకేఆర్‌కి ఫలితం దక్కింది...
54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ దశలో హెన్రీచ్ క్లాసిన్, అయిడిన్ మార్క్‌రమ్ కలిసి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రస్సెల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 35 బంతుల్లో 48 పరుగులు కావాలి..
వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. 40 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేసిన కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, వైభవ్ అరోరా బౌలింగ్‌లో రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 3 ఓవర్లలో 26 పరుగులు కావాల్సి వచ్చాయి. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. 4 బంతుల్లో 1 పరుగు చేసిన మార్కో జాన్సెన్, వైభవ్ అరోరా బౌలింగ్‌లో గుర్భాజ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
భువీ వస్తూనే ఫోర్ బాదగా, అబ్దుల్ సమద్ మరో ఫోర్ బాదడంతో 19వ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్‌లో సన్‌రైజర్స్‌కి 9 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికి సింగిల్ రాగా రెండో బంతికి కూడా సింగిల్ మాత్రమే వచ్చింది...
18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన అబ్దుల్ సమద్, భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర అనుకుల్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ విజయానికి చివరి 3 బంతుల్లో 7 పరుగులు కావాల్సి వచ్చాయి...
మయాంక్ మర్కండే తొలి బంతికి పరుగులేమీ చేయలేకపోయాడు. రెండో బంతికి సింగిల్ మాత్రమే రాగా చివరి బంతికి భువనేశ్వర్ కుమార్ భారీ షాట్‌కి ప్రయత్నించి బంతిని మిస్ చేశాడు. దీంతో కేకేఆర్‌కి 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం దక్కింది..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్ రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. రెండో ఓవర్ తొలి బంతికే రెహ్మనుల్లా గుర్భాజ్ డకౌట్ అయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో హారీ బ్రూక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు గుర్భాజ్..
4 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ కూడా అదే ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా నైట్ రైడర్స్. 19 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన జాసన్ రాయ్, కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. ఈ దశలో నితీశ్ రాణా, రింకూ సింగ్ కలిసి నాలుగో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసిన కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా, అయిడిన్ మార్క్‌రమ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
15 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్, మయాంక్ మర్కండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సునీల్ నరైన్, తన పేలవ ఫామ్‌ని కొనసాగించాడు. 2 బంతుల్లో 1 పరుగు చేసిన సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
వస్తూనే ఫోర్ బాదిన శార్దూల్ ఠాకూర్, టి నటరాజన్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన రింకూ సింగ్, నటరాజన్ వేసిన ఆఖరి ఓవర్‌లో అబ్దుల్ సమద్ పట్టన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు.. హర్షిత్ రాణా పరుగులేమీ చేయకుండానే నటరాజన్ వేసిన డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు.
