Asianet News TeluguAsianet News Telugu

IPL 2023 SRH vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... డేవిడ్ వార్నర్‌పైనే ఫోకస్ అంతా...

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... డేవిడ్ వార్నర్‌కి హైదరాబాద్‌లో అదిరిపోయే రికార్డు.. తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఇరుజట్లు..

IPL 2023 SRH vs DC:  Delhi Capitals won the toss and elected to bat first against Sunrisers CRA
Author
First Published Apr 24, 2023, 7:06 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడుతోంది.  టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా మొదటి ఐదు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, గత మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌పై గెలిచి బోణీ కొట్టింది. మరోవైపు మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా రెండు ఘన విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ గెలుపు జోరుని కొనసాగించలేకపోయింది. మళ్లీ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఆరు మ్యాచుల్లో రెండే విజయాలు అందుకుంది..

ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మాజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి ఉప్పల్ స్టేడియంలో తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ 31 ఇన్నింగ్స్‌లు ఆడిన డేవిడ్ వార్నర్, 66.75 సగటుతో 161.65 స్ట్రైయిక్ రేటుతో 1602 పరుగులు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు కూడా ఉన్నాయి...

అంతేకాదు గత సీజన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున అద్భుత హాఫ్ సెంచరీ చేసి, మ్యాచ్‌ని గెలిపించిన డేవిడ్ వార్నర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు..

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి బ్యాటింగ్‌లో ప్రధాన బలం డేవిడ్ వార్నర్ ఒక్కడే. వార్నర్ తర్వాత అక్షర్ పటేల్ ఒక్కడే కాస్తో కూస్తో ఆడుతున్నాడు. పృథ్వీ షాతో పాటు మిచెల్ మార్ష్, మనీవ్ పాండే, లలిత్ యాదవ్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు..

బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ గత మ్యాచ్‌లో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. ఆన్రీచ్ నోకియా కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నుంచి ఈ సీజన్‌లో వారెవా! అనిపించే స్పెల్స్ అయితే ఇప్పటిదాకా రాలేదు..

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఏదీ కలిసి రావడం లేదు. కేకేఆర్‌పై సెంచరీ చేసిన హారీ బ్రూక్, ఆ ఫామ్‌ని కొనసాగించలేకపోతున్నాడు. అయిడిన్ మార్క్‌రమ్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసిన్ మెరుపులు ఒకటి రెండు మ్యాచులకే పరిమితం అయ్యాయి. 

మయాంక్ మర్కండే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నా అతనికి ఫాస్ట్ బౌలర్ల నుంచి సరైన సహకారం లభించడం లేదు. టి నటరాజన్ భారీగా పరుగులు సమర్పిస్తుంటే ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్ కూడా గత రెండు మ్యాచుల్లో తేలిపోయారు..

మొత్తానికి ఐపీఎల్ 2023 సీజన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి ఆఖరి రెండు పొజిషన్లలో ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ విజయం చాలా అవసరం. ఆరింట్లో ఒకే విజయం అందించిన ఢిల్లీ క్యాపిటల్స్‌, నేటి మ్యాచ్‌లో గెలవకపోతే ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది కూడా ఇంచుమించు అదే పరిస్థితి...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది: అభిషేక్ శర్మ హారీ బ్రూక్, అయిడిన్ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, హెన్రీచ్ క్లాసిన్, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మర్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది: డేవిడ్ వార్నర్, ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ఆమన్ ఖాన్, రిపల్ పటేల్, ఆన్రీచ్ నోకియా, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios