IPL 2023, RR vs SRH: రాజస్తాన్ రాయల్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లోహైదరాబాద్ కు ఉత్కంఠ విజయం దక్కింది. చివరి బంతి వరకూ సాగిన ఈ హైఓల్టేజీ డ్రామాలో రాజస్తాన్ కు సొంతగడ్డపై మరో పరాభవం తప్పలేదు.
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు విఫలైమన చోట బ్యాటర్లు పోరాడి ఎస్ఆర్‌హెచ్ తలరాత మార్చారు. 215 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్.. ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరింతంగా ముగిసిన ఈ పోరులో హైదరాబాద్ బ్యాటర్లు అభిషేక్ శర్మ (34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (29 బంతుల్లో 47, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తో పాటు ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25, 1 ఫోర్, 3 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడి సన్ రైజర్స్ కు ఎట్టకేలకు ఓ విజయాన్ని అందించారు. ఢిల్లీపై గెలిచి ఇటీవలే కేకేఆర్ తో ఓడిన సన్ రైజర్స్ మళ్లీ విజయాల బాట పట్టడమే గాక పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి ఎగబాకింది. ఢిల్లీ మళ్లీ చివరి స్థానానకే చేరింది.
రెండు వందలకు పైగా పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ 5.5 ఓవర్లలోనే 51 పరుగులు చేసింది. నటరాజన్ స్థానంలో వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్.. 25 బంతుల్లోనే 4 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 33 పరుగులు చేశాడు. చాహల్ ఈ జోడీని విడదీశాడు. అతడు వేసిన ఆరో ఓవర్లో అన్మోల్ హెట్మెయర్ చేతికి క్యాచ్ ఇచ్చాడు.
అన్మోల్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాఠి గత మ్యాచ్ లలో విఫలమైనా నేడు మాత్రం రఫ్పాడించాడు. మురుగన్ అశ్విన్ వేసిన పదో ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు. పది ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ ఒక వికెట్ నష్టపోయి 87 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ - రాహుల్ త్రిపాఠిలు రెండో వికెట్ కు 65 పరుగులు జోడించారు. మురుగన్ అశ్విన్ వేసిన 12వ ఓవర్లో ఐదో బాల్ కు సిక్సర్ బాదిన అభిషేక్.. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 13వ ఓవర్లో మూడ బాల్ కు సిక్సర్ బాది నాలుగో బాల్ కు చాహల్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ ఉన్నది కాసేపే అయినా దుమ్ము దులిపాడు. 12 బంతుల్లోనే 2 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. మురుగన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు క్లాసెన్ సిక్స్ బాదగా తర్వాత త్రిపాఠి.. 6,4 కొట్టాడు. కుల్దీప్ వేసిన 15వ ఓవర్లో చివరి బంతికి క్లాసెన్ బౌండరీ కొట్టడంతో సన్ రైజర్స్ స్కోరు 150 పరుగులకు చేరింది. చాహల్ వేసిన 16వ ఓవర్లో 6,4 కొట్టిన క్లాసెన్ ఐదో బాల్ కు భారీ షాట్ ఆడి చాహల్ కు క్యాచ్ ఇచ్చాడు. క్లాసెన్ నిష్క్రమించిన కొద్దిసేపటికే త్రిపాఠిరి కూడా చాహల్ 18వ ఓవర్లో రెండో బాల్ కు ఔట్ చేశాడు.
ఫిలిప్స్, సమద్ విధ్వంసం..
చివరి 2 ఓవర్లలో సన్ రైజర్స్ విజయానికి 41 పరుగులు అవసరం కాగా గ్లెన్ ఫిలిస్స్ సిక్సర్ల మోత మోగించాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 19వ ఓవర్లో ఫిలిప్స్.. 6, 6, 6, 4 బాదాడు. కానీ ఐదో బాల్ కు భారీ షాట్ ఆడబోయి హెట్మెయర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ ఓవర్లో 24 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో ఫస్ట్ బాల్ కు 2 పరుగులు రాగా రెండో బంతికి సమద్ సిక్స్ కొట్టాడు. మూడో బాల్ కు 2 పరుగులు రాగా నాలుగు, ఐదు బంతులకు సింగిల్సే వచ్చాయి. చివరి బంతికి సమద్ నోబాల్ వేశాడు. విజయసమీకరణం 1 బాల్ 4 రన్స్ గా అవసరమైంది. సందీప్ వేసిన బంతిని స్ట్రైయిట్ సిక్సర్ కొట్టిన సమద్ సన్ రైజర్స్ కు విజయాన్ని అందించాడు. రాజస్తాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు తీయగా కుల్దీప్, అశ్విన్ లు తలా ఒక వికెట్ తీశారు. .
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్.. 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ సంజూ శాంసన్.. 38 బంతుల్లో 66 పరుగులు సాధించాడు.
