IPL 2023, RR vs GT: ఐపీఎల్-16లో నేడు  మరో రివేంజ్ డ్రామాకు తెరలేచింది. ఈ సీజన్ లో తమను ఓడించిన  రాజస్తాన్ పై   బదులుతీర్చుకునేందుకు  గుజరాత్ సిద్ధమైంది. 

ఐపీఎల్-16లో నేడు రాజస్తాన్ రాయల్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మరో రివేంజ్ డ్రామాకు రంగం సిద్ధమైంది. గత సీజన్ లో ఫైనల్స్ లో రాజస్తాన్ రాయల్స్ ను మూడు సార్లు ఓడించిన గుజరాత్ పై ఈ సీజన్ లో సంజూ శాంసన్ సేన విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకునేందుకు హార్ధిక్ పాండ్యా సేన సిద్ధమైంది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ నేతృత్వంలోని టాస్ గెలిచి రాజస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ కు రానుంది. 

ఈ సీజన్ లో ఆడిన 9 మ్యాచ్ లలో గుజరాత్ ఆరు గెలిచి మూడింట్లో ఓడింది. అహ్మదాబాద్ వేదికగా గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన గుజరాత్.. రాజస్తాన్ పై రివేంజ్ తో పాటు నేటి మ్యాచ్ లో గెలిచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నది.

ఢిల్లీతో మ్యాచ్ లో 131 టార్గెట్ ను ఛేదించడానికి పాండ్యా సేన నానా తంటాలు పడింది. చివర్లో రాహుల్ తెవాటియా మూడు సిక్సర్లు బాదినా గుజరాత్ ఐదు పరుగుల తేడాతో ఓడింది. గిల్, సాహా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లంతా ఈ మ్యాచ్ లో విఫలమయ్యారు. హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేసినా అది మ్యాచ్ ను గెలిపించలేదు. బౌలింగ్ లో మాత్రం గుజరాత్ రాక్ సాలిడ్ గా ఉంది. కొత్త బంతితో షమీ చెలరేగుతున్నాడు. మోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా లతో పాటు స్పిన్నర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లు జోరుమీదున్నారు. 

రాజస్తాన్ రాయల్స్ ఆడి 9 మ్యాచ్ లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. గత మ్యాచ్ లో చెన్నైపై విజయం సాధించిన రాజస్తాన్.. ఈ మ్యాచ్ లో గెలిచి మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాని భావిస్తున్నది. ఆ జట్టులో యశస్వి జైస్వాల్ జోరు మీదున్నా జోస్ బట్లర్ గత సీజన్ లో మాదిరిగా ధాటిగా ఆడటంలో విఫలమవుతున్నాడు. శాంసన్ ఫస్ట్ మూడు మ్యాచ్ లలో ఫర్వాలేదనిపించినా తర్వాత రాణించడంలేదు. కానీ షిమ్రన్ హెట్‌మెయర్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్ వంటి బ్యాటర్లు ఆ జట్టు సొంతం. 

బౌలింగ్ లో కూడా ఆ జట్టుకు ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అశ్విన్, చాహల్ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉంది. మరి స్వంత గ్రౌండ్ లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు గుజరాత్ బ్యాటర్లను ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. 

తుది జట్లు : 

రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ 

గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభివన్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, జోషువా లిటిల్