IPL 2023: ఐపీఎల్  - 16లో భాగంగా  రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్  యుజ్వేంద్ర చహల్    అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మాట్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ అతడే.. 

టీమిండియా స్పిన్నర్, ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఆడుతున్న యుజ్వేంద్ర చహల్ టీ20లలో అరుదైన ఘనతను అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్ లో 300 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో హ్యరీ బ్రూక్ వికెట్ తీయడం ద్వారా చహల్ ఈ ఘనతను అందుకున్నాడు. భారత్ నుంచి టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్ తర్వాత అశ్విన్ (288) ఉన్నాడు. 

సన్ రైజర్స్ తో మ్యాచ్ లో చహల్.. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ లో ఎస్ఆర్‌‌హెచ్ కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ తో పాటు మయాంక్ అగర్వాల్, అదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్ వికెట్లు చహల్ ఖాతాలోకే వెళ్లాయి. 

టీ20లో అత్యధిక వికెట్ల వీరులు.. 

నిన్నటి మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా చహల్.. ఈ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 15వ స్థానానికి చేరాడు. ఆసీస్ ఆటగాడు ఆండ్రూ టై (301) రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా ఈ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో (558 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ (530), సునీల్ నరైన్ (479) ఇమ్రాన్ తాహీర్ (469) షకిబ్ అల్ హసన్ (415) లు టాప్ -5 లో ఉన్నారు.

Scroll to load tweet…

లసిత్ మలింగ రికార్డు సమం.. 

హైదరాబాద్ తో మ్యాచ్ కు ముందు ఐపీఎల్ లో చహల్ 131 మ్యాచ్ లలో 166 వికెట్లు తీసి ఈ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. కానీ ఈ మ్యాచ్ లో 4 నాలుగు వికెట్లు తీయడం ద్వారా చహల్.. 170 వికెట్లకు చేరుకుని రాజస్తాన్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ పేరిట ఉన్న వికెట్ల రికార్డు (122 మ్యాచ్ లలో 170 వికెట్లు)ను సమం చేశాడు. మరో వికెట్ తీస్తే చహల్.. మలింగను అధిగమిస్తాడు.

ఐపీఎల్ లో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డ్వేన్ బ్రావో ముందున్నాడు. బ్రావో.. 161 మ్యాచ్ లలో 183 వికెట్లు పడగొట్టాడు. కాగా గత సీజన్ లో చహల్.. 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవడం పెద్ద విషయమేమీ కాదు. ఇప్పటికే ఈ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా నిలిచిన చహల్.. సీజన్ ముగిసేసరికి బ్రావోను కూడా వెనక్కి నెట్టడం ఖాయమే అంటున్నారు రాజస్తాన్ రాయల్స్ ఫ్యాన్స్.