46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసిన తిలక్ వర్మ... టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయినా 171 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్.. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగుల భారీ స్కోరు చేసింది. టాపార్డర్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ వైఫల్యంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వీరోచిత హాఫ్ సెంచరీ కారణంగా ఈ మాత్రం స్కోరు చేయగలిగింది..

ముంబై ఇండియన్స్‌కి శుభారంభం దక్కలేదు. 13 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రూ.17.5 కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి రీస్ తోప్లే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

జ్వరం నుంచి కోలుకుని నేటి మ్యాచ్‌లో ఆడుతున్న రోహిత్ శర్మ, క్రీజులో ఉన్నంత సేపు బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.. ఇన్నింగ్స్ మొదటి బంతికి సింగిల్ తీసిన రోహిత్ శర్మ, ఆ తర్వాత 9 బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. చివరికి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు రోహిత్. పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేసింది ముంబై ఇండియన్స్..

16 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, మైఖేల్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో షాబజ్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. తొలి మ్యాచ్ ఆడుతున్న నేహాల్ వదేరా, తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ బాదాడు. 

ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రోహిత్ క్యాచ్‌ని అందుకునేందుకు ప్రయత్నించిన మహ్మద్ సిరాజ్, దినేశ్ కార్తీక్ ఇద్దరూ బలంగా ఢీకొన్నారు. కిందపడిపోయిన సిరాజ్, మళ్లీ లేచి బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ కొట్టిన షాట్‌ని ఆపేందుకు డైవ్ చేసిన రీస్ తోప్లే గాయపడ్డాడు. నొప్పిని భరించలేకపోయిన తోప్లే, ఫిజియో సాయంతో పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఓ ఫోర్, సిక్సర్ బాదిన తిలక్ వర్మ, 16 పరుగులు రాబట్టాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ స్కోరు 78 పరుగులకి చేరుకుంది. 

కర్ణ్ శర్మ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన నేహాల్ వదేరా 13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కి ఈ ఇద్దరూ కలిసి జోడించిన 50 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. భారీ అంచనాలు పెట్టుకున్న టిమ్ డేవిడ్ 7 బంతుల్లో 4 పరుగులు చేసి కర్ణ్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించిన తిలక్ వర్మ, 32 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 3 బంతుల్లో 5 పరుగులు చేసిన హృతీక్ షోకీన్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 19వ ఓవర్‌లో ఏకంగా ఐదు వైడ్లు వేశాడు మహ్మద్ సిరాజ్..

మొదటి 3 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చిన మహ్మద్ సిరాజ్, ఆఖరి ఓవర్‌లో ఏకంగా 16 పరుగులు సమర్పించాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. ముంబై ఇండియన్స్ ఆఖరి 3 ఓవర్లలో 48 పరుగులు చేసింది..

తిలక్ వర్మ 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా అర్షద్ ఖాన్ 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేశాడు.