IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. జోఫ్రా ఆర్చర్‌పైనే భారం వేసిన ముంబై ఇండియన్స్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది..

 గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 మ్యాచుల్లో చిత్తుగా ఓడి, ఆఖరి స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ నుంచి ఈసారి కమ్‌బ్యాక్ పర్ఫామెన్స్ ఆశిస్తున్నారు అభిమానులు...

జస్ప్రిత్ బుమ్రాతో పాటు జే రిచర్డ్‌సన్ గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరం కావడం, ముంబై ఇండియన్స్‌కి భారీ ఎదురుదెబ్బ. అయితే గాయం కారణంగా గత సీజన్‌లో ఆడని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, ఈసారి ముంబై ఇండియన్స్‌కి ప్రధాన బౌలర్‌గా మారాడు..

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లతో ముంబై ఇండియన్స్‌కి బలమైన భారత బ్యాటింగ్ లైనప్ ఉంది. మూడు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ 2023 ట్రోఫీ కెప్టెన్ల ఫోటోషూట్‌లో రోహిత్ శర్మ పాల్గొనలేదు. జ్వరంతో రోహిత్ ఈ ఈవెంట్‌కి దూరమయ్యాడు. అతను పూర్తిగా కోలుకున్నాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది...

ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ని రూ.17.50 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. గ్రీన్‌తో పాటు సౌతాఫ్రికా యంగ్ సెన్సేషన్స్ డేవాల్డ్ బ్రేవిస్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఆస్ట్రేలియా హిట్టర్ టిమ్ డేవిడ్‌లతో ముంబై ఇండియన్స్ పేపర్ మీద బలంగానే ఉంది. అయితే గత సీజన్‌లో ముంబై నుంచి అలాంటి పర్ఫామెన్స్ రాలేదు..

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 15 సీజన్లుగా అభిమానులను నిరాశపరుస్తూ వస్తోంది. 2021లో మొదటి ఎలిమినేటర్‌లో ఓడిన ఆర్‌సీబీ, 2022 సీజన్‌లో రెండో క్వాలిఫైయర్‌లో ఓడింది. దీంతో ఈసారి ఆర్‌సీబీ‌పై భారీ అంచనాలే ఉన్నాయి.. 

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, దినేశ్ కార్తీక్ రూపంలో ఆర్‌సీబీకి కూడా మంచి బ్యాటర్లు ఉన్నారు. అయితే ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, గాయంతో మొదటి వారం ఐపీఎల్ ఆడడం లేదని వార్తలు వచ్చాయి. అయితే మొదటి మ్యాచ్‌లోనే గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చింది ఆర్‌సీబీ..

ముంబై ఇండియన్స్ జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వదేరా, హృతీక్ షోకీన్, పియూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లిసెస్ (కెప్టెన్), మైకేల్ బ్రాస్‌వెల్, షాబజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, రేస్ తోప్లే, మహ్మద్ సిరాజ్