IPL 2023, PBKS vs RR: పంజాబ్ కింగ్స్ తో ధర్మశాల వేదికగా ఉత్కంఠగా ముగిసిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ప్లేఆఫ్స్ రేసులో మిణుకుమిణుకుమంటున్న ఆశలను రక్షించుకోవాలంటే తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ తో ధర్మశాల వేదికగా ఉత్కంఠగా ముగిసిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్.. 19.4 ఓవర్లలో6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్ (30 బంతుల్లో 51, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (35 బంతుల్లో 50, 8 ఫోర్లు) లకు తోడు ఆఖర్లో షిమ్రన్ హెట్మెయర్ (28 బంతుల్లో 46, 4 ఫోర్లు, 3సిక్సర్లు), రియాన్ పరాగ్ (12 బంతుల్లో20, 2 సిక్సర్లు) లు రాణించడంతో ఆ జట్టు విక్టరీ కొట్టింది.
ఈ విజయంతో రాజస్తాన్ రాయల్స్ .. 13 మ్యాచ్ లలో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి ముంబైని వెనక్కి నెట్టి ఐదో స్థానానికి దూసుకెళ్లింది. ఇక ఆర్సీబీ, ముంబైలు తాము తర్వాత ఆడబోయే లీగ్ మ్యాచ్ లలో ఓడితే అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా రాజస్తాన్ ప్లేఆఫ్స్ కు వెళ్లే వీలుంది. గెలుపుతో సీజన్ ను ఆరంభించిన పంజాబ్.. ఓటమితో ముగించింది.
లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌కు రెండో ఓవర్లోనే రబాడా షాకిచ్చాడు. ఈ సీజన్ లో దారుణంగా విఫలమవుతున్న రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్.. మరోసారి డకౌట్ అయ్యాడు. గత మూడు మ్యాచ్ లలో బట్లర్ కు ఇది హ్యాట్రిక్ డకౌట్.
పడిక్కల్ - జైస్వాల్ జోరు..
బట్లర్ విఫలమైనా యువ సంచలనం యశస్వి జైస్వాల్ తో కలిసి వన్ డౌన్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ లు రాజస్తాన్ ను ఆదుకున్నారు. సామ్ కరన్ వేసిన ఫస్ట్ ఓవర్ లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన జైస్వాల్.. తర్వాత నెమ్మదించాడు. పడిక్కల్ పవర్ ప్లే లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. దీంతో 6 ఓవర్లలోనే రాజస్తాన్ స్కోరు 57-1 గా నమోదైంది.
రెండో వికెట్ కు జైస్వాల్ - పడిక్కల్ ద్వయం 73 పరుగులు జోడించారు. అర్ష్‌దీప్ వేసిన పదో ఓవర్లో మూడో బాల్ కు సిక్సర్ కొట్టిన పడిక్కల్.. మరుసటి బంతికే డబుల్ తీసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కానీ ఐదో బాల్ కు హర్‌ప్రీత్ బ్రర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే రాహుల్ చాహర్ వేసిన 11వ ఓవర్లో సంజూ శాంసన్ (2) కూడా రిషి ధావన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. నాథన్ ఎల్లీస్ వేసిన 15వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు సింగిల్ తీసిన జైస్వాల్ అర్థ సెంచరీ పూర్తయ్యాక మూడో బంతికి రివర్స్ స్వీప్ ఆడోయి రిషి ధావన్ కు క్యాచ్ ఇచ్చాడు. జైస్వాల్ - షిమ్రన్ హెట్మెయర్ లు నాలుగో వికెట్ కు 47 పరుగులు జోడించారు.
ఆఖర్లో హెట్మెయర్ మోత..
16 ఓవర్లో ముగిసేసరికి రాజస్తాన్.. నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 39 పరుగులు అవసరమయ్యాయి. సామ్ కరన్ వేసిన 17వ ఓవర్లో ఆరు పరుగులే రాగా రబాడా వేసిన 18వ ఓవర్లో రియాన్ పరాగ్ రెండు సిక్సర్లు కొట్టడంతో 14 పరుగులొచ్చాయి. కరన్ వేసిన 19వ ఓవర్లో హెట్మెయర్ రెండు బౌండరీలు బాది రాజస్తాన్ విజయాన్ని ఖాయం చేశాడు. ఆఖర్లో పరాగ్, హెట్మెయర్ లు ఔటౌనా.. ధ్రువ్ జురెల్ (4 బంతుల్లో 10 నాటౌట్, 1 సిక్స్) రాజస్తాన్ కు విజయాన్ని అందించాడు.
అంతకుముందు ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సామ్ కరన్ (49 నాటౌట్), జితేశ్ శర్మ (44), షారుక్ ఖాన్ (41 నాటౌట్) లు రాణించారు.
