IPL 2023, PBKS vs RR: పంజాబ్ కింగ్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆరంభంలో తడబడ్డా చివర్లో రాణించి ఆ జట్టు బౌలర్లకు పోరాడే లక్ష్యాన్ని అందించారు
ఉండీ లేనట్టుగా ఉన్న ప్లేఆఫ్స్ ఆశలను కాపాడుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాపార్డర్ బ్యాటర్లు మరోసారి విఫలమైనా మిడిలార్డర్ రాణించింది. రాజస్తాన్ బౌలర్ల ధాటికి ధర్మశాల వేదికగా జరుగుతున్న 66వ లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కరన్ (31 బంతులలో 49 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (28 బంతుల్లో 44, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తో పాటు చివర్లో షారుక్ ఖాన్ (23 బంతుల్లో 41 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించడంతో పంజాబ్ ఆ మాత్రమైనా స్కోరు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ కింగ్స్ కు ట్రెంట్ బౌల్ట్ ఫస్ట్ ఓవర్ లోనే షాకిచ్చాడు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2)ను బౌల్ట్.. ఫస్ట్ ఓవర్ లో రెండో బంతికే ఔట్ చేశాడు. 12 బంతుల్లో 3 బౌండరీలతో 19 పరుగులు చేసిన అథర్వ థైడేను నవదీప్ సైనీ.. నాలుగో ఓవర్లో పెవిలియన్ కు పంపాడు.
పంజాబ్ కెప్టెన్ శిఖర్ దావన్ 12 బంతులాడి 2 బౌండరీలు, ఓ సిక్సర్ తో 17 పరుగులు చేసి జోరు మీద కనిపించినా పవర్ ప్లే చివరి ఓవర్ వేసిన ఆడమ్ జంపా బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. మరికొద్దిసేపటికే లియామ్ లివింగ్‌స్టోన్ (9) ను కూడా నవదీప్ సైనీ ఏడో ఓవర్లో బౌల్డ్ చేశాడు. దీంతో పంజాబ్.. 50 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న జితేశ్..
రాజస్తాన్ బౌలర్ల జోరు చూస్తే ఈ మ్యాచ్ లో పంజాబ్ కనీసం 100 - 120 పరుగులు చేసినా గొప్పే అనిపించింది. కానీ పంజాబ్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ మాత్రం ధాటిగా జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. 28 బంతుల్లోనే 3 బౌండరీలు, 3 భారీ సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. సందీప్ శర్మ వేసిన పదో ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన జితేశ్.. సామ్ కరన్ తో కలిపి పంజాబ్ స్కోరును వంద దాటించాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 64 పరుగులు జోడించారు.
నవదీప్ సైనీ వేసిన 14వ ఓవర్లో జితేశ్.. 4, 6, 4 కొట్టి హాఫ్ సెంచరీకి దగ్గరయ్యాడు. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఫెరీరాకు క్యాచ్ ఇచ్చాడు. జితేశ్ నిష్క్రమించిన తర్వాత పంజాబ్ స్కోరు వేగం మళ్లీ తగ్గింది. సామ్ కరన్, షారుక్ ఖాన్ లు ఉన్నా హిట్టింగ్ చేయకపోవడంతో ఆ జట్టు స్కోరు 17 ఓవర్లకు 133 పరుగులుగానే ఉంది.
చివర్లో..
చాహల్ వేసిన 18వ ఓవర్లో షారుక్ ఖాన్ 4,6 కొట్టి కరన్ కు స్ట్రైక్ ఇవ్వగా కరన్ 6, 6, 4 బాదాడు. దీంతో ఈ ఓవర్లో 28 పరుగులొచ్చాయి. బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో కూడా 18 పరుగులు రావడంతో పంజాబ్.. రాజస్తాన్ ఎదుట పోరాడే లక్ష్యాన్ని నిలిపింది.
