IPL 2023: 42 బంతుల్లో 7 ఫోర్లు,  4 సిక్సర్లతో 82 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ ... జితేశ్ శర్మతో కలిసి 119 అజేయ భాగస్వామ్యం.... 

ఐపీఎల్‌లో ఒక్కసారి 200 పరుగులు చేయడానికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి టీమ్స్ అష్టకష్టాలు పడుతుంటే, పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో 200+ స్కోరు బాది సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. మరోవైపు ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో ప్రత్యర్థికి 200+ అప్పగించింది.

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగులకి ఆలౌట్ అయిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై 200 పరుగుల టార్గెట్‌ని ఛేదించగా, లక్నోతో మ్యాచ్‌లో 201 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 214 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్, రెండో మ్యాచ్‌లోనూ సరిగ్గా అదే స్కోరు చేసింది. ముంబైలో 214/8 స్కోరు చేసిన పంజాబ్ కింగ్స్, మొహాలీలో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌కి శుభారంభం దక్కలేదు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్. ఈ దశలో శిఖర్ ధావన్, మాథ్యూ షార్ట్ కలిసి రెండో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించారు..

20 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, పియూష్ చావ్లా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్, పియూష్ చావ్లా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

మాథ్యూ షార్ట్ అవుట్ అయ్యే సమయానికి 12 ఓవర్లలో 99 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో జితేశ్ శర్మ నాలుగు ఫోర్లు బాది 21 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ 3 ఫోర్లతో 14 పరుగులు రాబట్టాడు..

32 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్‌లో వైడ్ల రూపంలో మరో 5 పరుగులు రావడంతో ఏకంగా 27 పరుగులు వచ్చాయి..

4 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చిన జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్ కెరీర్‌లో చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. జితేశ్ శర్మ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేయగా, లియామ్ లివింగ్‌స్టోన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి 53 బంతుల్లో 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.