IPL 2023: ఐపీఎల్ - 16లో తొలుత మూడు మ్యాచ్ లలో కాస్త మెరుగ్గా ఆడిన పంజాబ్ కింగ్స్ మళ్లీ మునపటి బాట పట్టింది. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు.
ఐపీఎల్-16లో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ పై ధాటిగా ఆడిన పంజాబ్ కింగ్స్ మళ్లీ మునపటి బాటే పట్టింది. నిలకడ లేని ఆటతో ఆ జట్టు బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టడి చేయడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. మొదట్లో మాథ్యూ షార్ట్ (22 బంతుల్లో 36, 6 ఫోర్లు, 1 సిక్సర్), చివర్లో షారుక్ ఖాన్ (9బంతుల్లో22, 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టైటాన్స్ తో ఈ స్కోరును డిఫెండ్ చేయాలంటే పంజాబ్ బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేయాల్సిందే..
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ వరుసగా రెండో మ్యాచ్ లో కూడా డకౌట్ అయ్యాడు. మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే మిడ్ వికెట్ వద్ద ఉన్న రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. స్కోరుబోర్డుపై పరుగులేమీ చేయకుండానే పంజాబ్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది.
‘షార్ట్’కట్స్ లేకుండా బాదాడు..
రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన శిఖర్ ధావన్ (8) కూడా విఫలమయ్యాడు. జోషువా లిటిల్ వేసిన నాలుగో ఓవర్లో రెండో బంతికి అతడు అల్జారీ జోసెఫ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. కానీ వన్ డౌన్ లో వచ్చిన మాథ్యూ షార్ట్ ధాటిగా ఆడాడు. ప్రభ్‌సిమ్రన్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చి వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. మళ్లీ షమీనే వేసిన 3వ ఓవర్లో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. జోసెఫ్ వేసిన ఐదో ఓవర్లో 4, 6 బాదాడు. భానుక రాజపక్స (26 బంతుల్లో 20, 1 ఫోర్) తో కలిసి 20 బంతుల్లోనే 27 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ ఈ జోడీని రషీద్ ఖాన్ విడదీశాడు. రషీద్ వేసిన ఏడో ఓవర్లో షార్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
షార్ట్ స్థానంలో వచ్చిన జితేశ్ శర్మ (23 బంతుల్లో 25, 5 ఫోర్లు) ఉన్నంతసేపు స్కోరువేగాన్ని పెంచే యత్నం చేశాడు. రషీద్ ఖాన్, షమీ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్న జితేశ్.. మోహిత్ శర్మ వేసిన 13వ ఓవర్లో వికెట్ కీపర్ సాహా కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వరుసగా వికెట్లు పడుతున్నా క్రీజులో ఉన్న రాజపక్స బ్యాట్ ఝుళిపించలేదు. టెస్టు ఆటను తలపిస్తూ చూసేవాళ్లకు కూడా బోర్ తెప్పించాడు.
చివర్లో..
జితేశ్ శర్మ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సామ్ కరన్ (22 బంతుల్లో 22, 1 ఫోర్, 1 సిక్సర్).. భానుక తో కలిసి ఐదో వికెట్ కు 27 బంతుల్లో 23 రన్స్ జోడించాడు. కానీ రాజపక్స నిష్క్రమించిన తర్వాత షారుక్ ఖాన్ వచ్చీ రాగానే రెండు సిక్సర్లు కొట్టి మెరుపులు మెరిపించాడు. కానీ మోహిత్ శర్మ వేసిన 19వ ఓవర్లో తొలి బంతికే కరన్ ఔటయ్యాడు. ఆ ఓవర్లో షారుక్ ఓ ఫోర్ కొట్లాడు. జోషువా లిటిల్ వేసిన చివరి ఓవర్లో హర్‌ప్రీత్ బ్రర్ ఓ సిక్సర్ బాదగా షారుక్ రనౌట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శ్మ రెండు వికెట్లు తీయగా మిగిలిన బౌలర్లు (షమీ, లిటిల్, అల్జారీ, రషీద్ ఖాన్) లు తలా ఒక వికెట్ తీశారు.
