IPL 2023: పంజాబ్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మొహాలీ వేదికగా ముగిసిన మ్యాచ్ లో ఆతిథ్య పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. బ్యాటింగ్ వైఫల్యంతో ఆ జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది.
ఐపీఎల్ - 16లో మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్. ఈజీగా గెలుస్తుందనుకున్న గుజరాత్ టైటాన్స్ విజయం కోసం శ్రమించాల్సి వచ్చింది. నాలుగు రోజుల క్రితం కేకేఆర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడమే గాక పంజాబ్ కింగ్స్ పై ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. మొహాలీ వేదిగకా జరిగిన 18వ లీగ్ మ్యాచ్ లో పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 67, 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. పంజాబ్ బౌలర్లు మిడిల్ ఓవర్స్ లో గుజరాత్ బ్యాటర్లను కాస్త కట్టడి చేసినా వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. పంజాబ్ కు ఇది వరుసగా రెండో ఓటమి. నాలుగు మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు రెండింటిలో గెలిచి రెండింట్లో ఓడింది. గుజరాత్ టైటాన్స్ కు ఇది నాలుగు మ్యాచ్ లలో మూడో విజయం.
స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఎప్పటిలాగే గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా ( 19 బంతుల్లో 30, 5 ఫోర్లు) లు ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. అర్ష్‌దీప్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే బౌండరీతో ఖాతా తెరిచాడు గిల్. అతడే వేసిన మూడో ఓవర్లో సాహా.. 4 బౌండరీలు కొట్టాడు.
ధాటిగా ఆడుతున్న సాహాను ఐపీఎల్-16లో ఫస్ట్ మ్యాచ్ ఆడిన రబాడా ఔట్ చేశాడు. రబాడా.. ఐదో ఓవర్లో నాలుగో బంతికి సాహా.. షార్ట్ కు క్యాచ్ ఇచ్చాడు. ఐపీఎల్ లో రబాడాకు ఇది వందో వికెట్. 28 బంతుల్లోనే 48 పరుగులు జోడించిన ఓపెనింగ్ జోడీ నిష్క్రమించడంతో సాయి సుదర్శన్ (19) క్రీజులోకి వచ్చాడు.
పవర్ ప్లేలో వీరవిహారం చేసిన గుజరాత్ స్కోరు వేగం ఆ తర్వాత తగ్గింది. సామ్ కరన్, రాహుల్ చాహర్ తో పాటు మాథ్యూ షార్ట్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గిల్ - సుదర్శన్ లు నెమ్మదిగా ఆడారు. ఇద్దరూ కలిసి 40 బంతుల్లో 41 పరుగులు జోడించారు. ఈ జోడీని అర్ష్‌దీప్ విడదీశాడు. ఒక మ్యాచ్ గ్యాప్ తర్వాత ఆడిన హార్ధిక్ పాండ్యా (8) కూడా హర్‌ప్రీత్ బ్రర్ బౌలింగ్ లో సామ్ కరన్ చేతికి చిక్కాడు.
గిల్ హాఫ్ పెంచరీ..
ఓపెనర్ గా వచ్చి ఫస్ట్ ధాటిగా ఆడిన గిల్ మధ్యలో నెమ్మదించాడు. కానీ వికెట్ కోల్పోకుండా ఆడుతూ ఒక్కో పరుగు కూడబెట్టాడు. రాహుల్ చాహర్ వేసిన 16వ ఓవర్లో నాలుగో బంతిని బౌండరీకి తరలించి 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి నాలుగు ఓవర్లలో 34 పరగులు అవసరం కాగా.. గిల్ - డేవిడ మిల్లర్ (18 బంతుల్లో 17 నాటౌట్, 1 ఫోర్) లు దాదాపు పని పూర్తి చేశారు.
మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్..
గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో ఏడు పరుగులు అవసరం కాగా.. ఫస్ట్ బాల్ కు మిల్లర్ సింగిల్ తీశాడు. రెండో బాల్ గిల్ బౌల్డ్ అయ్యాడు. మూడో బాల్ కు ఒక్క పరుగే వచ్చింది. ఐదో బంతికి రాహుల్ తెవాటియా (5 నాటౌట్, 1 ఫోర్) బౌండరీ కొట్టి గుజరాత్ విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (36), జితేశ్ శర్మ (25), షారుక్ ఖాన్ (22) రాణించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శ్మ రెండు వికెట్లు తీయగా షమీ, జోషువా లిటిల్, అల్జారీ, రషీద్ ఖాన్ లు తలా ఒక వికెట్ తీశారు.
