ఉత్కంఠకు తెర.. కేకేఆర్ సారథిగా నితీశ్ రాణా.. అధికారిక ప్రకటన
IPL 2023: ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ కీలక ప్రకటన చేసింది.

ఐపీఎల్ - 2023కి గాను కోల్కతా నైట్ రైడర్స్ కొత్త సారథిని ప్రకటించింది. ఈ సీజన్ లో సారథ్య పగ్గాల కోసం పలువురు పోటీపడినా చివరికి టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఆ జట్టు సీనియర్ బ్యాటర్ నితీశ్ రాణా వైపునకే మొగ్గు చూపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కేకేఆర్ ఈ ప్రకటన చేసింది. ఆ జట్టు రెగ్యులర్ సారథి శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో కేకేఆర్ కొత్త సారథి వేటలో పడింది. కెప్టెన్సీ రేసులో పలువురు సీనియర్ ఆటగాళ్ల పేర్లు వినిపించినా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం నితీశ్ రాణా వైపునకే మొగ్గు చూపింది.
శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, షకిబ్ అల్ హసన్ లతో పాటు శార్దూల్ ఠాకూర్ ల పేర్లూ సారథ్య రేసులో గట్టిగా వినిపించినా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అనూహ్యంగా నితీశ్ రాణాకు పగ్గాలు అప్పజెప్పడం విశేషం. ట్విటర్ వేదికగా రాణాకు సారథ్య బాధ్యతలు ప్రకటించిన కేకేఆర్.. కొత్త కోచింగ్ స్టాఫ్ మార్గదర్శకత్వంలో టీమ్ ను ముందుండి నడిపిస్తాడని కేకేఆర్ ఆశాభావం వ్యక్తం చేసింది.
నితీశ్ నేపథ్యమిది..
ఢిల్లీకి చెందిన రాణా.. 2016లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు 2016, 2017 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రాణా అంచనాలకు మించి రాణించాడు. దీంతో 2018లో కేకేఆర్ అతడిని వేలంలో దక్కించుకుంది. అప్పట్నుంచీ కేకేఆర్ బ్యాటింగ్ లో రాణా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరుసగా నాలుగు సీజన్లలో 300 ప్లస్ స్కోర్లు చేశాడు. 2021లో 17 మ్యాచ్ లు ఆడి 383 పరుగులు చేసిన రాణా.. 2022లో 14 మ్యాచ్ లలో 361 పరుగులు సాధించాడు. మొత్తంగా ఐపీఎల్ లో 91 మ్యాచ్ లు ఆడిన రాణా.. 2,181 పరుగులు చేశాడు. బౌలింగ్ లో ఏడు వికెట్లు కూడా తీశాడు. కేకేఆర్ తరఫున 74 మ్యాచ్ లు ఆడి 1,744 రన్స్ చేశాడు.
కేకేఆర్ కంటే ముందే రాణా.. సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీకి 12 టీ20లలో సారథిగా వ్యవహరించిన అనుభవం ఉంది. ఐపీఎల్ లో తొలిసారి కెప్టెన్ గా ఉండనున్న రాణా.. కేకేఆర్ ను ఎలా నడిపిస్తాడో చూడాలి.
కోచింగ్ టీమ్ :
ఈ సీజన్ లో కొత్త సారథితో పాటు కేకేఆర్ కు హెడ్ కోచ్ కూడా మారాడు. గత కొన్ని సీజన్లపాటు బ్రెండన్ మెక్‌కలమ్ కేకేఆర్ కు హెడ్ కోచ్ గా ఉండగా ఇప్పుడు ఆ బాధ్యతలను చంద్రకాంత్ పాటిల్ తీసుకుంటున్నాడు. ఈయన మార్గదర్శకత్వంలోనే మధ్యప్రదేశ్.. రంజీ చరిత్రలో తొలిసారి 2022లో ట్రోఫీ నెగ్గింది. భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఇక ఐపీఎల్ - 16లో కేకేఆర్.. ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తో తొలి గేమ్ ఆడనుంది.