IPL 2023: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్ అయిన రోహిత్ శర్మ... టాపార్డర్ అట్టర్ ఫ్లాప్! హాఫ్ సెంచరీతో ఆదుకున్న నేహాల్ వదేరా... 3 వికెట్లు తీసిన పథిరాణా..
ఐపీఎల్ 2022 సీజన్‌లో నాలుగంటే నాలుగే విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్. ఈ సీజన్‌లో ఇప్పటికే 5 విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, కాస్త మెరుగైన ప్రదర్శనే ఇచ్చింది. బౌలర్లు విఫలమైనా, బ్యాటర్లు అదరగొడుతుండడంతో పంజాబ్ కింగ్స్‌పై 215 పరుగుల భారీ టార్గెట్‌ని ఊదేసింది ముంబై. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చేతులు ఎత్తేశారు... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది.
ఫామ్‌లో లేని రోహిత్ శర్మ, తనను తాను డిమోట్ చేసుకుని కామెరూన్ గ్రీన్‌ని ఓపెనర్‌గా పంపాడు. అయితే ఈ ప్రయోగం ఫలితం ఇవ్వలేదు. 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
9 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో తీక్షణకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో 3 బంతులు ఆడిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
ఐపీఎల్ కెరీర్‌లో రోహిత్ శర్మకు ఇది 16వ డకౌట్. కెప్టెన్‌గా 11వ డకౌట్. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా, కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ని సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వదేరా కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు..
నాలుగో వికెట్‌కి సూర్య, నేహాల్ కలిసి 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 69 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్...
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన నేహాల్ వదేరా, 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 3 ఫోర్లు బాదిన నేహాల్ వదేరా, ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి ఐదో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు..
51 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 పరుగులు చేసిన నేహాల్ వదేరా, మతీశ పథిరాణా బౌలింగ్‌లో వైడ్ యార్కర్‌కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 బంతులాడి 2 పరుగులు చేసిన టిమ్ డేవిడ్, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
వస్తూనే అర్షద్ ఖాన్ ఇచ్చిన క్యాచ్‌ని శివమ్ దూబే జారవిడిచాడు. అయితే ఆ అవకాశాన్ని పెద్దగా వాడుకోలేకపోయిన అర్షద్ ఖాన్, 2 బంతుల్లో 1 పరుగు చేసి పథిరాణా బౌలింగ్‌లో గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 21 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్, పథిరాణా బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ఆఖరి బంతికి పియూష్ చావ్లా 2 పరుగులు తీశాడు. ఆఖరి ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్, 5 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది.
